న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున ్న కమల దళం త్వరలో ఎన్నికల కమిటీని నియమించనుంది. ఆ తర్వాత ఈ కమిటీ సభ్యుల సహకారంతో ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించనుంది. గత ఎన్నికల్లో విజయం సాధించినవారిలో అత్యధిక శాతం మందికి ఈసారి కూడా టికెట్లు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. అయితే వీరిలో కొందరికి ఈసారి ఇవ్వకపోవచ్చని ఆ పార్టీ నాయకుడొకరు తెలియజేశారు. కొత్తవారికి అవకాశం కల్పించొచ్చన్నారు. ఇదిలాఉండగా త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనలో బీజేపీ రాష్ర్ట శాఖ నిమగ్నమైంది. దీంతోపాటు ప్రచార వ్యూహానికి రూపకల్పన చేస్తోంది. మేనిఫెస్టో కమిటీ సభ్యులు మూడు రోజుల క్రితం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
పనితీరుపై అధ్యయనం: ఏడాదికాలంగా తమ పార్టీ శాసనసభ్యుల పనితీరుపై అధ్యయనం చేయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. గత ఎన్నికల్లో మూడు వేలు లేదా 3,500 ఓట్ల తేడాతో పరాజయం పాలయినవారికి కూడా టికెట్లు ఇచ్చే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తోంది. మోదీ వేవ్ బలంగా ఉన్నందువల్ల ఇటువంటి వారంతా భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని అంచనా వేస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించిన కరణ్‌సింగ్ తన్వర్, రాష్ర్ట శాఖ అధికార ప్రతినిధి రాజీవ్ బబ్బర్, సదర్‌బజార్ అభ్యర్థి జైప్రకాష్, సంగంవిహార్ అభ్యర్థి చరణ్‌లాల్ గుప్తా తదితరులు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇటువంటి వారందరికీ ఈ పర్యాయం టికెట్లు ఇచ్చే అంశం పరిగణనలో ఉందని ఆ పార్టీ నాయకుడొకరు మీడియాకు తెలియజేశారు.
కొత్తవారికీ అవకాశం: విధానసభకు ఈసారి జరగనున్న ఎన్నికల్లో కొంతమంది కొత్త అభ్యర్థులకు కూడా టికెట్లు ఇచ్చే అంశాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. షాలిమార్‌బాగ్, షకూర్‌బస్తీ, మోడల్‌టౌన్ తదితర నియోజకవర్గాలనుంచి కొత్తవారిని బరిలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతోపాటు ఇతర పార్టీలను వీడి తమ పార్టీలో చేరినవారికి సైతం టికెట్లు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జాబితాలో ఆప్ మాజీ నేత, మాజీ స్పీకర్ ఎం.ఎస్.ధీర్‌కూడా ఉన్నారు. ధీర్ కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరిన సంగతి విదితమే. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే.
త్వరలో బీజేపీ ఎన్నికల కమిటీ
Published Sun, Nov 23 2014 11:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement