బీబీఎంపీ మేయర్ పదవికి బీజేపీలో పోటాపోటీ
- బీఆర్. నంజుండప్ప వైపు పలువురి మొగ్గు
- ఆది నుంచి పార్టీలోనే ఉన్నవారినే ఎంపిక చేయాలని ఆశావహుల సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీబీఎంపీ పాలక మండలి పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనున్న తరుణంలో, రొటీన్ పద్ధతిలో చివరి, ఐదో మేయర్‌ను వచ్చే నెల ఐదో తేదీన సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈసారి జనరల్ కేటగిరీకి ఈ పదవి రిజర్వు కావడంతో ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది.
వచ్చే ఏడాది మేలో బీబీఎంపీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి తిరిగి అధికారంలోకి వస్తామనే ఆశల్లేవు. దీంతో ఆ పార్టీ కార్పొరేటర్లు మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎవరిని ఎంపిక చేస్తే, వచ్చే ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుందనే దిశగా పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు.
సీనియర్ సభ్యులైన బీఆర్. నంజుండప్ప, గంగ భైరయ్య, ఏహెచ్. బసవరాజు, శాంత కుమారి పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. నంజుండప్పకు అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ, ఆయన వేరే పార్టీ నుంచి వలస వచ్చారని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు అడ్డు తగులుతున్నారు. ఆది నుంచి పార్టీలోనే ఉన్న వారినే మేయర్ పదవికి ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో అనుభవంతో పాటు అజాత శత్రువనే పేరున్నందున, ఆయనను మేయర్ స్థానంలో కూర్చోబెట్టాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
తొలి నుంచీ పార్టీలోనే ఉన్న తనను ఎంపిక చేయాలని గంగ భైరయ్య పట్టుబడుతున్నారు. మరో సీనియర్ సభ్యురాలు శాంత కుమారి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈమెకు మాజీ మంత్రి సోమన్న ఆశీస్సులు ఉన్నాయి. మరో మాజీ మంత్రి ఆర్. అశోక్ తన ఆప్తులైన నంజుండప్ప లేదా బసవరాజ్‌కు మేయర్ పదవిని కట్టబెట్టాలని పట్టుదలతో ఉన్నారు.