బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల సిబల్‌తో హర్షవర్ధన్ ఢీ
Published Sun, Mar 16 2014 10:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శనివారం రాత్రి విడుదలయింది. రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలకూ పేర్లను వెల్లడిచేసింది. ఇటీవలే పార్టీలో చేరిన మహేశ్ గిరి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, దళిత నాయకుడు ఉదిత్‌రాజ్‌కు సీట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. చాందినీచౌక్ ఎంపీ, కేంద్రమంత్రి కపిల్ సిబాల్‌పై బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పోటీ చేస్తారని వెల్లడించింది. న్యూఢిల్లీ స్థానాన్ని పార్టీ జాతీయస్థాయి నాయకుల్లో ఒకరికి కేటాయించవచ్చన్న పుకార్లు నిజమయ్యాయి. ఇక్కడి నుంచి మీనాక్షి లేఖీని బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవని హర్షవర్ధన్ ఇది వరకే ప్రకటించారు. అయితే పశ్చిమఢిల్లీ, దక్షిణ ఢిల్లీ స్థానాల లోక్‌సభ టికెట్లను ఎమ్మెల్యేలు ప్రవేశ్ శర్మ, రమేశ్ బిధూరీకి కేటాయించారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాలకు అధికారికంగా పేర్లను ప్రకటించలేదు.
ఎవరు ఎక్కడి నుంచి..
డాక్టర్ హర్షవర్ధన్ : చాందినీచౌక్
ఈసారి హర్షవర్ధన్‌కు చాందినీచౌక్‌లో భారీ పోటీ తప్పకపోవచ్చు. కపిల్ సిబాల్‌కు ఇక్కడ జనాదరణ ఎక్కువేనని చెబుతారు. ఢిల్లీలో ఆప్ బలమైన శక్తిగా ఎదిగిన నేపథ్యంలో ఇక్కడ ఆ పార్టీ జర్నలిస్టు ఆశుతోష్‌ను నిలబెట్టింది. పైగా చాందినీచౌక్‌లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ గెలుపు కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. మైనారిటీల ఓట్లు ఆప్, కాంగ్రెస్ మధ్య చీలుతాయి కాబట్టి అంతిమంగా తమకే ప్రయోజనం ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.
మీనాక్షి లేఖీ : న్యూఢిల్లీ
బీజేపీ ఈ సీటును తన సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖీకి కేటాయించింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్‌ను, ఆప్ జర్నలిస్టు ఆశిష్ ఖేతాన్‌ను బరిలోకి దింపాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్‌కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ప్రధానపోరు బీజేపీ, ఆప్ మధ్య ఉంటుంది.
ఉదిత్‌రాజ్ : వాయవ్య ఢిల్లీ
ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కాబట్టి బీజేపీ తరఫున దళిత నాయకుడు ఉదిత్ రాజ్ పోటీ చేస్తారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్ పోటీలో ఉంటారు. ఆప్ నుంచి మహేందర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య భారీ పోటీకి అవకాశం ఉంది. రాజ్‌కు దళితవర్గాల్లో పేరు ఉంది కాబట్టి బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువని ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు.
మనోజ్ తివారీ : ఈశాన్య ఢిల్లీ
పార్టీలో ఇటీవలే చేరిన భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి బీజేపీ ఈశాన్యఢిల్లీ సీటు ఇచ్చింది. కాంగ్రెస్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ, డీపీసీసీ మాజీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్‌తో ఆయన పోటీ పడుతున్నారు. ఇక ఆప్ ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్‌ను ఇక్కడి నుంచి నిలబెట్టింది. కుమార్ స్థానికుడు కారని, తాము మద్దతు ఇవ్వబోమంటూ కొందరు ఆప్ అసమ్మతులు ప్రకటించడం ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు.
ప్రవేశ్ వర్మ : పశ్చిమ ఢిల్లీ
మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు అయిన ప్రవేశ్‌వర్మ పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా, ఆప్ అభ్యర్థి, జర్నలిస్టు జర్నైల్ సింగ్ ఆయన తలపడతారు. వర్మ మెహ్రౌలీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మహేశ్ గిరి : తూర్పుఢిల్లీ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధిపతి శ్రీశ్రీ రవిశంకర్ శిష్యుడిగా పేరున్న మహేశ్‌గిరి ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఇది వరకే మూడుసార్లు ఎంపీగా విజయం సాధించిన సందీప్ దీక్షిత్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. గాంధీ మనవడు, ప్రొఫెసర్ రాజ్‌మోహన్ గాంధీ ఆప్ నుంచి పోటీలో ఉన్నారు. తూర్పుఢిల్లీ వాసులు చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ఇక్కడి వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి తాను ప్రయత్నిస్తానని గిరి అన్నారు.
రమేశ్ బిధూరి : దక్షిణ ఢిల్లీ
సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బిధూరికి దక్షిణ ఢిల్లీ ఎంపీ సీటు టికెట్ ఇస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ ఆప్ అభ్యర్థి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రమేశ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని కులాలు, వర్గాల ఓట్లు వచ్చేలా అభ్యర్థులను బీజేపీ ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పూర్వాంచలీయుల ఓట్లు కీలకం కాబట్టి తివారీకి సీటు దక్కిందని చెబుతున్నారు.
Advertisement
Advertisement