రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ సీని యర్ నాయకుడు సతీష్ ఉపాధ్యాయను అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ సీని యర్ నాయకుడు సతీష్ ఉపాధ్యాయను అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. ఉపాధ్యాయ ప్రస్తుతం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) స్థాయీసమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు . దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్ నియోజకవర్గం నుంచి ఆయన కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల నాటినుంచి రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్న డా. హర్షవర్ధన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి కేంద్ర మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ పదవికి రాజీనామా చేస్తారని, ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని పార్టీ వర్గాలు భావించా యి. అధ్యక్ష పదవి రేసులో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకుల పేర్లు వినిపించాయి.
అయితే పలువురు కేంద్ర నేతలతో పాటు ఆర్.ఎస్.ఎస్.తో ఉన్న సత్సంబంధాల కారణంగా సతీష్‌ను ఈ పదవి వరించింది. ఢిల్లీలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో సతీష్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. సతీష్ 1981 వరకు ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా ఉన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) పోటీచేసి విజయకేతనం ఎగురవేశారు. అప్పటినుంచీ ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. 1984-85లో ఆయన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆ తరువాత బీజేపీ యువ మోర్చా కార్యదర్శి, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. 2012 మున్సిపల్ ఎన్నికలలో ఆయన మాలవీ యనగర్ నుంచి పోటీచేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. సౌత్ ఎమ్సీడీ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన తరువాత స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ దేశ ప్రజలు బీజేపీకి ఇచ్చిన తీర్పును ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశముందని ప్రశ్నించగా ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందన్నారు. భవిష్య కార్యాచరణను కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. కాగా సతీష్ ఉపాధ్యాయ నియామకం పట్ల బీజేపీ రాష్ర్ట శాఖ హర ్షం వ్యక్తంచేసింది. ఇదిలాఉంచితే సతీష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా.
వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడతారు
సతీష్ ఉపాధ్యాయను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నియమించడంపట్ల ఆ పార్టీ నాయకుడు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ)లో సభానాయకుడు సుభాష్ ఆర్య హర్షం వ్యక్తంచేశారు. సతీష్ పార్టీలో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడతారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సామాజిక మీడియా గొప్పదనం ఆయనకు తెలుసన్నారు. వాటిని వినియోగించుకోవడంద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.