కమలం ఏం చెబుతుంది?
కమలం ఏం చెబుతుంది?
Published Mon, Apr 14 2014 11:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందడి సద్దుమణిగింది. వాటి ఫలితాలను గురించి ఊహాగానాలు మాత్రం వచ్చే నెల 1 వరకు కొనసాగతూనే ఉంటాయి. ఈలోగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఏప్రిల్ 17న తమ వైఖరిని బీజేపీ, కాంగ్రెస్‌లు న్యాయస్థానానికి తెలియజేయవలసిఉంది. ఆ తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందా? లేక మళ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందా? అనే వషయంలో స్పష్టత రానుంది. జన్‌లోక్‌పాల్ బిల్లుపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం హఠాత్తుగా రాజీనామా సమర్పించడం, ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ముందుకు పోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీలో రాష్ట్రపతిపాలన విధించాలని, అసెంబ్లీని రద్దుచేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఎల్జీ సూచనల మేరకు హోం మంత్రిత్వశాఖ వ్యవహరించడంతో నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పటికీ ద్వారాలు తెరచే ఉన్నాయి.
నగరంలో వెంటనే ఎన్నికలు జరిపించకుండా రాష్ర్టపతి పాలన విధించడాన్ని, అసెంబ్లీని రద్దుచేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టుకు వెళ్లింది. దీనిపై న్యాయస్థానం బీజేపీ, కాంగ్రెస్‌లకు నోటీసు జారీ చేసి, జవాబు కోరింది. కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నాయా? లేదా? తెలపాలని న్యాయస్థానం రెండు పార్టీలను ఆదేశించింది. అయితే రెండు పార్టీల సమీకరణాలను చూసినట్లయితే రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయడం కల్లేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. దాంతో పాటు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌తోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయడంతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సుముఖంగా లేదన్న విషయం చెప్పకనే చెప్పినట్లయింది. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మరిన్ని సీట్లు గెలిచినట్లయితే ఆ పార్టీ నగరంలో వెంటనే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోమారు ఎన్నికలకు తాను సిద్ధమని మొదటి నుంచి చెబుతున్న బీజేపీ విధానసభ ఎన్నికలు జరిపించాలని గ ట్టిగా డిమాండ్ చేయవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరుతోంది. ఎన్నికలలో గెలిచే అవకాశాలు అంతగా కనిపించనప్పటి కీ కాంగ్రెస్ కూడా ఎన్నికలు జరిపించాలనే అంటోంది. దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీలో మళ్లీ ఎన్నికల పోరు ప్రారంభమయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement