చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన బలమైన బీజేపీ కూటమి బీటలు వారుతోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో కలిసి నడిచిన పార్టీలు పక్కదారిపట్టగా కమలనాథుల కూటమి కల్లోలంలో పడిపోయింది. అన్నాడీఎంకే లేదా డీఎంకే లేని కూటములను రాష్ట్రంలో ఊహిం చుకోలేము. గతంలో అలాంటి కూటములు ఏర్పడిన దాఖలాలు కూడా లేవు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రాతిని థ్యం లేకుండా మరో ఏడు ప్రాంతీయ పార్టీల కూటమిని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఫలితాల పరంగా పెద్ద ప్రయోజనం లేకున్నా, బలహీనమైన బీజేపీ ఒక బలమైన కూటమిగా ఏర్పడటం రాజకీయ సంచలనమే. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల బరిలో అదే కూటమితో దిగాలని ఆశపడిన కమలనాథులను కూటమి నేతలు కంగారు పెడుతున్నారు.
కాంగ్రెస్ నుంచి వైదొలిగి కొత్త పార్టీ పెట్టబోతున్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌కు బీజేపీ కూటమిలోని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రకటన సభకు తమ పార్టీ నేతలు హాజరవుతారని సైతం మాటిచ్చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను పార్టీలో చేర్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన కమలనాథులు, ఆయన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుభాకాంక్షలు చెప్పడంతో ఖంగుతిన్నారు. కూటమిలోని మరోపార్టీ పీఎంకే సైతం డీఎంకే అధినేత కరుణానిధితో స్నేహం పెంచుకుంటోంది. కూటమిలోని మరోపార్టీ ఎండీఎంకే సైతం బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా మారింది. డీఎంకేతో చేతులు కలిపేందుకు ఎండీఎంకే సిద్ధం అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇచ్చారు.
అంతేగాక మరో వైపు కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం ప్రారంభించారు. ఐదుగురు జాలర్లకు ఉరిశిక్ష అంశంలో ప్రధాని మోదీ వైఖరిని ఎండీఎంకే అధ్యక్షుడు వైగో తీవ్రంగా దుయ్యబట్టారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం ప్రతిదాడికి దిగింది. బీజేపీ జాతీయ నేత హెచ్ రాజా, రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సోమవారం మీడియా వద్ద వైగో వైఖరిని ఎండగట్టారు. ప్రధానిని విమర్శించడం వైగో మానుకోవాలని వారు హెచరించారు. శ్రీలంక అంశంలో మోదీని తప్పుపడితే తమిళనాడు పార్టీ సహించబోదన్నారు. కూటమిలో ఉన్న వైగోను బీజేపీ నేరుగా హెచ్చరించడం ఇదే తొలిసారి. ఎండీఎంకేతో తెగతెంపులకు సిద్దమైన తర్వాతనే బీజేపీ ఇటువంటి నిర్ణయానికి వచ్చినట్లు బోగట్టా.