నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ రాష్ట్ర సాధన కోసం అంతిమపోరుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించింది. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేస్తే అధికారం పూర్తిగా ఎన్సీపీ చేతికి వెళ్తుందని కాంగ్రెస్ భయపడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం అన్నారు. విదర్భ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని హచ్చరించారు. ‘తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలతో కాంగ్రెస్‌కు హింస అంటే తెలిసే ఉంటుంది. తెలంగాణవాదులు ఆశయసాధన కోసం కొన్నేళ్లపాటు హింసాత్మక పోరాటాలు కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరబోతోంది. యూపీఏ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతోంది’ అని ఆయన వివరించారు.
బీజేపీ ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. తమ పార్టీ 1992లో భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విదర్భ ఏర్పాటుకు తీర్మానం ఆమోదించిన విషయాన్ని ఫడణవీస్ గుర్తు చేశారు. విదర్భ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ‘ఎన్నో హామీలిస్తారు కానీ పరిహారం మాత్రం చెల్లించడం లేదు. అందుకే అన్నదాతల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఫిబ్రవరిలో ‘అడ్వాంటేజ్ విదర్భ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యుత్, నీటిచార్జీలు భారీగా ఉండడం వల్ల ఏ ఒక్క కంపెనీ కూడా పరిశ్రమ స్థాపనకు ముందుకు రాలేదు’ అని ఫడణవీస్ అన్నారు. చార్జీలు తగ్గిస్తామన్న హామీ ఇప్పటికీ నిలబెట్టుకోకపోవడంతో పెట్టుబడులు రావడం లేదని పేర్కొన్నారు.
పొరుగున్న ఉన్న ఛత్తీస్‌గఢ్ పరిశ్రమలకు ఎన్నో రాయితీలు ఇస్తోందని, ఈ విషయంలో పృథ్వీరాజ్‌ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందో అర్థం కావడం లేదని ఈ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. పేదల ఆరోగ్యం కోసమంటూ యూపీయే అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రాజీవ్‌గాంధీ జీవన్‌దాయీ యోజన పథకంలో ఎన్నో లోపాలున్నాయని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ఆరోగ్య బీమా కోసం రూ.130 కోట్లు చెల్లించేదని, ఇప్పుడు దానిని రూ.830 కోట్లకు పెంచడం వల్ల ఇన్సూరెన్సు కంపెనీలకు మాత్రమే లాభమని విశ్లేషించారు. మరిన్ని రోగాలను ఈ బీమా పథకంలో చేర్చాలని ప్రభుత్వాన్ని తాము చాలాసార్లు కోరిన పట్టించుకోలేదని ఫడణవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లాకు అంధేరీలో విలువైన స్థలాన్ని కేవలం రూ.98 వేలకు కేటాయించడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ముంబైని బంగారుబాతుగా చూస్తోందని, ఈ భూకేటాయింపును తక్షణం రద్దు చేయాలని దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు.
విదర్భ కోసం తెగిస్తాం
Published Wed, Dec 4 2013 12:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement