రజనీ చూపు ఏవైపు
రాష్ట్రంలో పార్టీల గె లుపు ఓటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారో అనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. రజనీ అభిమానులు చెన్నై, సేలం జిల్లాలో మంగళవారం సమావేశమై అభిప్రాయ సేకరణ జరపడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఎన్నికల్లో గెలుపునకు ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోని రాజకీయ పార్టీలు సినీ నటులను సైతం ముగ్గులోకి దింపడం పరిపాటే. ఇందులో జాతీయ పార్టీలకు మినహాయింపు కాదు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అమితాబ్‌బచ్చన్ తదితరులను, బీజేపీ శత్రుఘ్నసిన్హ వంటి తెరవేల్పులను రాజకీయ తెరపైకి తెచ్చింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సైతం సినీనటులు చక్రం తిప్పారు. అందునా తమిళనాడులో రాజకీయ సినీరంగాలు అన్నాదురై హయాంలోనే దాదాపు ఒక్కటైపోగా మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, శివాజీ గణేశన్, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సినిపరిశ్రమతో అనుబంధం ఉన్నవారే. ఎంజీఆర్ తరువాత అంతటి ప్రజాభిమానం, అనుచరగణం ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అనుగ్రహం కోసం పార్టీలు ఎదురుచూస్తుంటాయి. 1996లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి రజనీ మద్దతు పలికారు. ఆ తరువాత ఎన్నికల్లో రజనీ బీజేపీకి ఓటువేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిపాలన అందించే పార్టీకి ఓటు వేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
బీజేపీ పాకులాట
రాబోయే ఎన్నికల్లో రజనీకాంత్ మద్దతు పొందాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. రజనీకి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సన్నిహితుడు కావడం అవకాశంగా తీసుకున్న రాష్ట్ర నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నారు. బీజేపీ జాతీయ నేత ఇల గణేశన్ ఎలాగైనా రజనీ మద్దతు పొందాలని డిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇటీవల చెన్నైకి మోడీ వచ్చినపుడు ఇద్దరినీ కలపాలని ప్రయత్నం చేశారు. గత మూడు నెలలుగా ఎవరెన్ని ప్రకటనలు చేస్తున్నా రజనీమాత్రం నోరుమెదపడం లేదు.
అభిప్రాయ సేకరణలో అభిమానులు
రాబోయే ఎన్నికల్లో అభిమానులు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో తెలుసుకునేందుకు రజనీకాంత్ అభిమాన సంఘాల నేతలు మంగళవారం చెన్నై రాయపేటలోని ఒక హోటల్లో సమావేశమయ్యూరు. సేలంలోనూ సమావేశం నిర్వహించారు. ప్రతి అభిమానిని వేర్వేరుగా తీసుకెళ్లి అభిప్రాయాలను రికార్డు చేశారు. కేంద్రంలో సమర్థవంతమైన సుస్థిరపాలన రావాలని, ధరలు తగ్గుముఖం పట్టాలని, విద్యుత్ కోతలు లేని పాలన కావాలని, ఆర్దిక పరిపుష్టి కలగాలని అభిమానులు కోరుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఇవన్నీ సమకూర్చగల పార్టీకి రజనీ అభిమానులు ఓటేస్తారని తెలిపారు. అభిప్రాయసేకరణ పూర్తయిన తరువాత నివేదికను రజనీకాంత్‌కు సమర్పిస్తామని, తుది నిర్ణయం ఆయన తీసుకుంటారని నిర్వాహకులు వివరించారు.