సాక్షి, ముంబై: బల్క్ ద్వారా ఇంధనం కొనుగోలు గిట్టుబాటు కాకపోవడంతో బీఎంసీ బయట పెట్రోల్ బంకుల నుంచి కొనుగోలు ప్రారంభించింది. బల్క్ పద్ధతిలో ఇంధనం కొనుగోలుపై ఇటీవల ప్రభుత్వంపై లీటరుకు రూ.10 అదనపు భారం మోపింది. దీని ప్రభావం బీఎంసీపై పడింది. ఈ భారాన్ని భరించే స్తోమతలేక బయట పెట్రోల్ బంకుల నుంచి బీఎంసీ డీజిల్ కొనుగోలు చేస్తోంది. బల్క్ ద్వారా ఇంధనం కొనుగోలుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలపై పడింది. దీంతో బస్సులకు అవసరమైన డీజిల్‌ను బయట పెట్రోల్ బంకుల నుంచి ఎమ్మెస్సార్టీసీ కొనుగోలు చేస్తోంది.
బీఎంసీ కూడా ఇదే బాట పట్టినట్లు అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని తెలిపారు. బీఎంసీకి వర్లీ, ఎల్ఫిన్‌స్టన్ రోడ్, ఘాట్కోపర్‌లో గ్యారేజీలు ఉన్నాయి. బీఎంసీ చేతిలో 1,140 వాహనాలున్నాయి. 280 కార్లు, జీపులు, స్కార్పి యో, చిన్నాచితకా వాహనాలతోపాటు చెత్తను తరలించే ట్రక్కులు ఉన్నాయి. ప్రస్తుతం బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర లీటరుకు రూ.63.83 ఉంది. అదే బల్క్‌లో కొనుగోలు చేస్తే రూ.10 అదనంగా చెల్లించాలి. ఇలా బీఎంసీకి ప్రతీరోజు 17,500 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ప్రస్తు తం ఆరు వేల లీటర్ల డీజిల్‌ను బయట బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల బీఎంసీకి రోజుకు రూ.60 వేలు ఆదా అవుతున్నాయి. త్వరలో మిగతా డీజిల్‌ను కూడా బయటి బంకుల నుంచి కొనుగోలు చేస్తామని అడ్తాని చెప్పారు.
బీఎంసీకి ‘బల్క్’ భారం
Published Thu, Apr 17 2014 11:15 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement