ఉప సమరం..ప్రశాంతం
ఉప సమరం..ప్రశాంతం
Published Sun, Nov 20 2016 2:03 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
అరవకురిచ్చి, నెల్లితోపులో భారీగా ఓటింగ్
ఓటు వేయని అభ్యర్థులు
నోటాకు అవనియాపురం ఓట్లు
ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో సరళి వీక్షణ
22న ఫలితాలు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరిలోని ఓ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రశాంత పూరిత వాతావరణంలో శనివారం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగిన ఈ ఎన్నికల్లో అరవకురిచ్చి, నెల్లితోపుల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, జల్లికట్టు తమకు దూరం అవుతుండడాన్ని నిరసిస్తూ తిరుప్పరగుండ్రం నియోజకవర్గం పరిధిలోని అవనియాపురం ఓటర్లు తమ ఓటు నోటాకు అని ప్రకటించి మరి ముందుకు సాగడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు బట్వాడా హోరుతో తంజావూరు, అరవకురిచ్చిల్లో ఎన్నికలు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో తిరుప్పర గుండ్రం ఖాళీ అరుుంది. పుదుచ్చేరిలోని నెల్లితోపు ఎమ్మెల్యే జాన్‌కుమార్ తమ సీఎం నారాయణస్వామి కోసం పదవిని త్యాగం చేశారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాలకు గాను ఉపఎన్నిక శనివారం జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిఘా నీడలో ఎన్నికలు సాగారుు. ఓటర్లు ఉత్సాహంగానే తరలి వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. కరూర్ జిల్లా అరవకురిచ్చిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థిగా సీనియర్ నాయకుడు కేసీ పళని స్వామి, బీజేపీ అభ్యర్థిగా ప్రభు, పీఎంకే అభ్యర్థిగా భాస్కరన్, డీఎండీకే అభ్యర్థిగా అరవై ముత్తు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
తంజావూరులో డీఎంకే అభ్యర్థిగా డాక్టర్ అంజుగం భూపతి, అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగస్వామి, బీజేపీ అభ్యర్థి ఎంఎస్ రామలింగం, డీఎండీకే అభ్యర్థిగా అబ్దుల్ షేట్, పీఎంకే అభ్యర్థిగా కురింజిపాదం, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా నల్లదురైలలో ఎవరి మీద ఓటరు కరుణ చూపించారో వేచి చూడాల్సి ఉంది. మధురై జిల్లా తిరుప్పరగుండ్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోసు, డీఎంకే అభ్యర్థి శరవణన్, డీఎండీకే అభ్యర్థిగా ధనపాండియన్ పోటీలో దిగడంతో సమరం ఆసక్తికరంగా సాగింది. పుదుచ్చేరిలోని నెల్లితోపు ఎన్నికల రేసులో ఆ రాష్ట్ర సీఎం నారాయణస్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా, ఓం శక్తి శేఖర్ అన్నాడీఎంకే అభ్యర్థులుగా ప్రధాన పోటీలో దిగారు. అరుుతే, సీఎం రేసులో ఉన్న దృష్ట్యా, విజయం ఏక పక్షం అన్న సంకేతాలు ఉన్నారుు.
ప్రశాంతంగా ఓటింగ్: అరవకురిచ్చి నియోజకవర్గం పరిధిలో 245 పోలింగ్ బూతుల్లో నిఘా నీడలో ఎన్నికలు సాగాయి. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు 40 శాతం మేరకు, మూడు గంటలకు 73 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల అన్నాడిఎంకే, డిఎంకే వర్గాలు వాగ్యుద్దాలు, తోపులాటలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి ఉండడంతో, నాయకులకు ముచ్చెమటలు తప్పలేదు. కొన్ని చోట్ల అధికారులు అన్నాడీఎంకే వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
యథేచ్ఛగా నోట్లను ఓటర్లకు ఇచ్చి మభ్య పెడుతున్నా, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటలకు 81.92 శాతంగా ఓటింగ్ నమోదైంది. ఇక, తంజావూరులో 276 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ సాగింది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువతీ,యువకులు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పద కొండు గంటల తర్వాత ఓటింగ్ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాభై శాతంగా ఓటింగ్ నమోదైంది. మూడు గంటలకు 60.5 శాతానికి చేరుకుంది.
సాయంత్రం ఐదు గంటలకు 69 శాతంగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కూడా పలు చోట్ల డీఎంకే, అన్నాడీఎంకే వర్గాల మధ్య వివాదంరాజుకున్నా పోలీసులు కొరడా ఝుళిపించడంతో సద్దుమనిగింది. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఆరుగుర్ని పోలీసులకు డీఎంకే నాయకులు అప్పగించారు. మధురై జిల్లా తిరుప్పరగుండ్రంలో అరుుతే, ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. ఇక్కడి 291 పోలింగ్ బూతుల్లో ఐదింటిని మోడరన్‌గా తీర్చిదిద్దారు. హరిదాపట్టి, కరిదిగల్, పనయూర్, అరలతోటై్ట పోలింగ్ బూత్‌ల వద్ద తోరణాలు, అరటి గెలలతో పండుగ సందడి వలే అలంకరించారు. ఈ కేంద్రాల్లో ఓటర్లకు ప్రత్యేకంగా కూర్చీలు, ఏసీ సౌకర్యం కూడా కల్పించడం విశేషం. మధ్యాహ్నం ఒంటి గంటకు 60 శాతం ఓటింగ్ జరగ్గా, తదుపరి మందగించింది.
మూడు గంటలకు అదనంగా రెండు శాతం మాత్రమే ఓటింగ్ సాగింది. ఓటర్లను మభ్య పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని, అన్నాడీఎంకే వర్గాలపై డీఎంకే ఫిర్యాదులు చేయడం పలు పోలింగ్ బూత్‌ల వద్ద వివాదానికి దారి తీశారుు. తెన్‌కరింజి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు టీ కాఫీ, టిఫెన్‌ల నిమిత్తం టోకెన్లను అందిస్తున్న అన్నాడీఎంకే నాయకుల్ని తహసీల్దార్ మహేశ్వరి పట్టుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పార్టీ వర్గాలపై కేసులు నమోదు అయ్యారుు. ఇక, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన నలుగుర్ని ఎన్నికల అధికారులు పట్టుకోవడం విశేషం. సాయంత్రం ఐదు గంటలకు 70 శాతంగా ఓటింగ్ నమోదైంది. జల్లికట్టు తమకు దూరం అవుతుండడంతో ఆవేదన చెందిన అవనియాపురం ఓటర్లు తిర్పుర గుండ్రం ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఉదయం ప్రకటించారు.దీంతో అధికార వర్గాలు ఉరుకులు పరుగులు తీసి వారిని బుజ్జగించినట్టుంది. చివరకు తమ ఓటు నోటాకు అంటూ ముందుకు సాగడం గమనార్హం.
పుదుచ్చేరిలో: పుదుచ్చేరిలో కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల నడుమ ఎన్నికలు సాగారుు. నివాస ప్రాంతాలతో కూడిన నెల్లితోపులో 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పది కేంద్రాలు ఒకే చోట ఏర్పాటు చేయడంతో రాజకీయ పక్షాలు తమ వీరంగాలను ప్రదర్శించేందుకు వీలు లేనంతగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓ చోట కాంగ్రెస్‌వ ర్గాలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ తన పార్టీ వర్గాలతో రోడ్డెక్కడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించారు. ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు 40 శాతంగా ఉన్న ఓటింగ్ తదుపరి పుంజుకుంది. మూడు గంటలకు డెబ్బై శాతంగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రానికి 85.76గా ఓటింగ్ శాతం తేలింది.
ఓటు వేయని అభ్యర్థులు: ఉప ఎన్నికల రేసులో ఉన్న అభ్యర్థులు మెజారిటీ శాతం తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి. ఇందుకు కారణం ఆయా నియోజకవర్గాల్లో తమకు ఓటు హక్కుల లేకపోవడమే. తంజావూరు డీఎంకే అభ్యర్థి అంజుగం భూపతి అక్కడి సర్బోజి స్కూల్ ఆవరణలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి అన్నాడిఎంకే అభ్యర్థి రంగస్వామి ఓటు పాపనాశం నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. తిరుప్పరగుండ్రంలో బరిలో దిగిన డీఎంకే, అన్నాఎంకే అభ్యర్థులకు, అరవకురిచ్చి రేసులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు ఆ నియోజకవర్గాల్లో ఓట్లు లేవు. ఇక, పలువురు స్వతంత్ర అభ్యర్థులకే కాదు, బీజేపీ, పీఎంకే అభ్యర్థులకు కూడా ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామికి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కులేదు. అయితే, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ తాను పోటీచేసిన నెల్లితోపులోని ఓ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో సరళి వీక్షణ: ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని చెన్నై నుంచి పరిశీలించారు. రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం ఉన్న 812 పోలింగ్ బూత్‌లలో 187 బూత్‌లలో మాత్రం ఎన్నికల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేశారు. మిగిలిన అన్నీ బూత్‌లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో ఎప్పటికప్పుడు ఆయా బూత్‌లలోని పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆయా అధికారులకు సమాచారాలు వెళ్లడం, అక్కడి నుంచి సమాచారాలు రాబట్టడం, పరిస్థితులను తెలుసుకునే విధంగా ప్రక్రియ ముందుకు సాగడంతో ఉప ఎన్నిక సమరం ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతమైంది.
22న ఫలితాలు: ఉప ఎన్నిక ముగియడంతో ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన కళాశాలలకు తరలించారు. తిరుప్పరగుండ్రం పరిధిలో ఉపయోగించిన ఈవీఎంలను మధురై మెడికల్ కళాశాలకు, తంజావూరు నియోజకవర్గంలో ఉపయోగించిన ఈవీఎంలను నాచ్చియార్‌కళాశాలకు, అరవకురిచ్చి ఈవీఎంలను కరూర్ కరుప్పస్వామి కళాశాలకు, పుదుచ్చేరి నెల్లితోపు ఈవీఎంలను అక్కడి భారతీ దాసన్ కళాశాలకు తరలించారు.
Advertisement
Advertisement