
నేడు కేబినెట్ భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పళనిస్వామి పగ్గాలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తోంది. ఈ కాలంలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
► అత్యవసరంగా ఏర్పాట్లు
► చెన్నైకు మంత్రులు
రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. అత్యవసరంగా పిలుపు నివ్వడంతో సొంత జిల్లాలకు వెళ్లిన మంత్రులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. హఠాత్తుగా కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా పళనిస్వామి పగ్గాలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తోంది. ఈ కాలంలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పదిహేను వందలకు పైగా ఫైల్స్ మీద సంతకాలతో ఆమోద ముద్ర వేశారు. గత నెల బడ్జెట్‌ను సభలో దాఖలు చేయించారు. ఇరకాటాలు, అడ్డంకులు ఎదురవుతున్నా, పదవిని కాపాడుకుంటూ ప్రజాకర్షణ దిశగా తీవ్రంగానే ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. మూడు రోజులుగా తన సొంత జిల్లా సేలం లో సుడిగాలి పర్యటనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసరంగా కేబినె ట్ మీటింగ్‌కు చర్యలు తీసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఎం చెన్నైలో లేని దృష్ట్యా, మంత్రులందరూ తమ తమ సొంత జిల్లాలకు వెళ్లి ఉన్నారు. కేబినెట్ పిలుపుతో చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. అత్యవసరంగా పిలుపునిచ్చిన దృష్ట్యా, ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ప్రధానంగా జులై నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్‌కు రిజర్వేషన్ల వర్తింపు ఉత్తర్వుల జారీ, ఎన్నికల నిర్వహణకు తగ్గ ఇతర ప్రక్రియలకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి. అందుకు కీలక నిర్ణయాలు కేబినెట్‌లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రైతు సమస్యల మీద చర్చ, నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు లక్ష్యంగా ఒత్తిడి పెంచే విధంగా చర్చ సాగే అవకాశాలు ఎక్కువే. అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేసినా శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చ సాగలేదు. ఇందుకు తగ్గట్టు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ముందు మరో వ్యవహారంగా గుర్తింపు లేని ఇళ్ల స్థలాలకు పట్టాల మంజూరు వివాదం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా చర్చించి కోర్టుకు వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి.