సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ రాష్ట్ర శాఖ నాయకుల్లో సంతోషం వ్యక్తమైంది. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పార్టీ రాష్ట్ర శాఖలో మోడీ అభ్యర్థిత్వంపై సర్వానుమతి ఉంది. ముఖ్యంగా యువకులు మోడీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని ఉబలాటపడుతూ వచ్చారు.
అద్వానీ నాయకత్వంలో గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోవడంతో మోడీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించరేమోననే ఆదుర్దా పార్టీ కార్యకర్తల్లో కనిపించింది. అద్వానీ అభ్యంతరాలను తోసిరాజని ఎట్టకేలకు మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. మాజీ మంత్రి ఆర్. అశోక్ నాయకత్వంలో టౌన్ హాలు వద్ద స్కూటర్ ర్యాలీని నిర్వహించారు.
కమలంలో జోష్
Published Sat, Sep 14 2013 1:32 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement