
కెప్టెన్‌కు షాక్
సాక్షి, చెన్నై: విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ప్రకంపనలు బయలుదేరాయి. విజయకాంత్‌కు కుడి భుజంగా, పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా ఉన్న చంద్రకుమార్ తిరుగు బావుటా ఎగుర వేశారు. ఆయన వెంట ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడంతో విజయకాంత్‌కు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఆగమేఘాలపై వారిలో పది మందిని పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, తమ వెంట మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు నడవబోతున్నారని చంద్రకుమార్ ప్రకటించారు. ప్రజాసంక్షేమ కూటమితో కలసి తమఅధినేత విజయకాంత్ అడుగులు వేయడాన్ని డీఎండీకే వర్గాలు పెద్ద సంఖ్యలో వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్ తీరును నిరసిస్తూ పలువురు టాటా చెప్పే పనిలో పడ్డారు. డీఎంకే దళపతి స్టాలిన్ చేపట్టిన ఆకర్ష్‌తో పలువురు జిల్లాల కార్యదర్శులు ఇప్పటికే డీఎండీకేను వీడారు. మరెందరో డీఎండీకేను వీడబోతున్నట్టుగా తీర్థం పుచ్చుకున్న వాళ్లందరూ ప్రకటిస్తూ వస్తున్నారు.
ఈ సమయంలో అసెంబ్లీలో విజయకాంత్ తదుపరి స్థానంలో, కెప్టెన్‌కు కుడి భుజంగా, పార్టీలో కీలక పదవిలో ఉన్న చంద్రకుమార్ తిరుగుబాటు డీఎండీకేలో కలకలం రేపింది. చంద్రకుమార్ వెంట గుమ్మిడి పూండి శేఖర్, మెట్టూరు ఎస్‌ఆర్ పార్తిబన్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు నడవడం గమనార్హం. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు మరో 24 గంటల్లో తన వెంట రాబోతున్నారని చంద్రకుమార్ ప్రకటించడంతో ఆ పార్టీలో ప్రకంపనలు బయలుదేరాయి.
తిరుగు బాటు : మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చంద్రకుమార్‌తో కలసి నలుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు చెన్నై ప్రెస్ క్లబ్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఇప్పటికే డీఎండీకే నుంచి వలసలు డీఎంకేలోకి బయలు దేరి ఉండడంతో, వీరి రాక ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. మీడియాతో చంద్రకుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకేతో కలిసి గత ఎన్నికల్లో పయనం సాగించి విజయ ఢంకా మోగించినా, తమ కెప్టెన్ నిర్ణయంతో ఎదురైన కష్టాలు, నష్టాలను గుర్తు చేశారు.
విజయకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి తిరుగు బావుట ఎగుర వేశారు. 95 శాతం మంది పార్టీ వర్గాలు డీఎంకేతో కలిసి అడుగులు వేద్దామని విజయకాంత్‌కు సూచించారన్నారు. ఇందుకు కెప్టెన్ కట్టుబడి, చివరకు ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరడాన్ని జీర్ణించుకోలేక పోయామని వ్యాఖ్యానించారు. ఆ కూటమితో కలసి మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తెచ్చేందుకు తమ కెప్టెన్ అడుగులు వేయడాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో మీడియా ముందుకు వచ్చామన్నారు.
24న ఈ విషయంగా కెప్టెన్‌కు లేఖ రాశామని, ఆయన నుంచి స్పందన లేని దృష్ట్యా, ఇక మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. డిఎంకేతో కలసి అడుగులు వేద్దామని, ఇకనైనా ప్రజా సంక్షేమ కూటమిని వీడాలంటూ బుధవారం మధ్యాహ్నం వరకు విజయకాంత్‌కు గడువు ఇస్తూ మాటల తూటాల్ని పేల్చారు. విజయకాంత్ తమను ఆహ్వానించి సంప్రదింపులు జరుపుతారన్న నమ్మకం ఉందని, ఆయన అలా వ్యవహరించని పక్షంలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, మరో పది మంది జిల్లాల కార్యదర్శులు బయటకు అడుగు పెట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు. ఇక, తదుపరి అడుగు డీఎంకే వైపు అన్న విషయాన్ని పరోక్ష వ్యాఖ్యలతో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక డీఎండీకేలో ప్రస్తుతం కెప్టెన్ మాటకు చెల్లుబాటు లేదని, అంతా వదినమ్మ (ప్రేమలత విజయకాంత్) హవా అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఉద్వాసన : విజయకాంత్‌కు బుధవారం మధ్యాహ్నం వరకు చంద్రకుమార్ అండ్ బృందం గడువు ఇస్తే, డీఎండీకే పార్టీ కార్యాలయం మాత్రం ఆ బృందానికి రెండున్నర గంటల్లో షాక్ ఇచ్చింది. విజయకాంత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటుగా, పది మందికి ఉద్వాసన పలుకుతూ ప్రకటన వెలువరించింది. అలాగే, మరి కొందరిపై చర్యలు తప్పదని , అందుకు తగ్గ కార్యాచరణలో ఉన్నట్టు వివరించడం గమనార్హం. చంద్రకుమార్ తో కలిసి అడుగులు వేస్తూ పది హేను జిల్లాలకు చెందిన కీలక నాయకులు బయటకు అడుగులు వేయడం, మరో పదిహేను మంది సిద్ధం అవుతోన్న సంకేతాలతో విజయకాంత్ అప్రమత్తం అయ్యారు.
ఉన్న వాళ్లనైనా దక్కించుకునేందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఆగమేఘాలపై బుధవారం పార్టీ సమావేశానికి పిలుపు నిచ్చారు. ఇక, ఇప్పటికే 29 మందిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఐదుగురు బయటకు వెళ్లడంతో, మిగిలిన పదిహేను మందితో పాటుగా జిల్లాల కార్యదర్శులు తప్పని సరిగా సమావేశానికి హాజరు కావాలని పిలుపు నిచ్చి ఉన్నారు. అదే సమయంలో చంద్రకుమార్ అండ్ జట్టు డీఎంకే నోట్లకు అమ్ముడు పోయారంటూ డీఎండీకేకు చెందిన ఎమ్మెల్యేలు నల్లతంబి, మోహన్ రాజులు ఆరోపించడం గమనార్హం. చంద్రకుమార్ సృష్టించి, ప్రకంపనతో ఇన్నాళ్లు కార్యకర్తలు లేక బోసి పోయిన ఉన్న డీఎండీకే కార్యాలయంలో తాజాగా హడావుడి నెలకొని ఉండడం కొసమెరుపు.