స్కూటీపై వచ్చి చెత్త పడేస్తున్న మహిళను ప్రశ్నిస్తున్న మార్షల్స్
గార్డెన్ సిటీ గార్బేజ్ సిటీగా మారుతుండడంతో హైకోర్టు కొరడా ఝలిపించింది. చెత్త సమస్యను మీరు పరిష్కరిస్తారా?, మేం రంగంలోకి దిగాలా? అని అక్షింతలు వేయడంతో నగర పాలికెలో చలనమొచ్చింది. నగరంలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేసేవారిపై నిఘా వేసి జరిమానాలు విధిస్తోంది. నెలరోజుల్లోనే భారీగా పట్టుబడడంతో సత్ఫలితాలను ఇస్తున్నట్లే ఉంది.
కర్ణాటక , బనశంకరి: ఉద్యాననగరిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తే చుట్టుపక్కల ప్రజలు ఏమీ అనలేకపోవచ్చు. కానీ బీబీఎంపీ నియమించిన మార్షల్స్ మాత్రం చూస్తూ ఉరుకోరు. అలా చెత్త పడేసేవారిపై ఒక నెల వ్యవధిలో 2,965 కేసులు నమోదు చేశారు. చెత్త నిర్వహణ లోపాలపై హైకోర్టు బీబీఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాలికె మేలుకుంది. సుమారు 40 మంది మార్షల్స్ ను నియమించడంతో రాత్రి సమయాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే వారిని గుర్తించి 2,965 కేసులు నమోదు చేసి అక్కడే వారిపై జరిమానా విధించారు.
చెత్త వాహనాల్లో వేయరెందుకు
రోజూ ఉదయం వేళ ఇళ్ల వద్దకు వచ్చే పాలికె చెత్త వాహనాల్లో చెత్త వేయడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. అంతేగాక చెత్త వాహనం కోసం వేచిచూడటం కంటే రాత్రి సమయంలో రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్త బ్యాగ్‌లు పడేయడం సులభమని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ బీబీఎంపీ నియమించిన మార్షల్ అలాంటివారు కనిపిస్తే జరిమానా విధిస్తారు. మార్షల్స్‌కు పట్టుబడిన వారు ఇకపై రోడ్లపై చెత్త వేయబోమని అంటున్నారు. ఒక నెల అవధిలో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం విశేషం.
ఎవరెవరు దొరికారు
బీబీఎంపీ మార్షల్స్ ఆచూకీ కనిపెట్టిన 2,965 కేసుల్లో 1,023 మంది బైక్‌లు, స్కూటర్లలో చెత్త తీసుకువచ్చి పడేసి వెళ్లేవారు. 128 మంది ఆటోరిక్షాల్లో , 71 మంది వివిధ మోటారు వాహనాల్లో , 22 మంది ట్రక్కుల్లో, 33 మంది ట్రాక్టర్లులో, 1,688 మంది నడచి వెళ్లి చెత్తపడేసినిట్లు తేలింది. చిన్నపాటి బ్యాగుల్లో మాత్రమే కాకుండా ట్రాక్టర్లు, ట్రక్కుల్లో తెచ్చి అక్రమంగా చెత్త పడేస్తుండటంతో నగరంలో ఎటుచూసినా చెత్త రాశులు కనిపిస్తున్నాయి.
మార్షల్స్ సంఖ్య పెంచాలి
బెంగళూరులో కేవలం 40 మంది మార్షల్స్‌తో చెత్త వేసే వారిని అడ్డుకట్టవేయడం కుదరదని, ఇంకా 240 మంది మార్షల్స్ నియమించుకోవడానికి నిధులు అందించాలని బీబీఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. ప్రతి మార్షల్‌కు నెలకు రూ.18,525, మరో 8 మంది జూనియర్ అధికారులకు రూ.40 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. వీటిన్నింటిని కలిపితే ఏడాదికి రూ.8.48 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. చెత్త పడేసివెళ్లే వారిపై జరిమానా రూపంలో వసూలు చేసిన దానిలో మార్షల్స్ కు 5 శాతం ప్రోత్సాహక ధనం అందించాలని తీర్మానించారు.
జరిమానాలు పెంపు?
♦ ప్రస్తుతం చెత్త పడేస్తున్న వారిపై కనీసం రూ.500 జరిమానా విధిస్తున్నారు. జరిమానా పెంచితే సమస్య తగ్గుముఖం పడుతుందని బీబీఎంపీ అభిప్రాయపడింది.
♦ చెత్త పడేసే వారిపై రూ.1,000 నుంచి రూ.25 వేలు వరకు జరిమానా విధించాలని బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
♦ ఇక బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తే రూ.500, తడి–పొడి చెత్త విభజన చేయనివారిపై రూ.1,000, కట్టడ శిథిలాలు పడేసేవారిపై రూ.25 వేలు చొప్పున జరిమానా విధించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి బీబీఎంపీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment