సాక్షి, న్యూఢిల్లీ: ఆరెకటికలను ఎస్సీ జాబితాలో చేర్చడంతోపాటు, ఆరెకటిక కులానికి రూ.600 కోట్లతో ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర ఆరెకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఆరెకటిక పోరాట సమితి సభ్యులు దీనిలో పాల్గొన్నారు. ఈ ధర్నాకి ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దేవేందర్‌గౌడ్ మద్దతు తెలిపారు.
ఈ సంద ర్భంగా ఆరెకటిక పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గొగికార్ సుధాకర్ మాట్లాడుతూ... దేశంలోని 18 రాష్ట్రాల్లో ఆరెకటికలు ఎస్సీ జాబితాలో ఉన్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తమను కసాయి కటిక అని కించపరిచే విధంగా మాట్లాడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో, రిలయన్స్ వంటి ప్రైవేటు సంస్థల నుంచి తమ వృత్తిని కాపాడాలని కోరారు. రాష్ట్రంలో 45 నుంచి 50 లక్షల మంది జనాభా కలిగిన ఆరెకటికలను ఏ రాజకీయ పార్టీ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో పోటీచేసేలా అన్ని రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
వీరి ధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంపీలు మాట్లాడుతూ.. ఆరెకటికల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సహకరిస్తామన్నారు. భవిష్యత్తులో చేయబోయే ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎంపీలతోపాటు కర్ణాటకకి చెందిన ఎమ్మెల్సీ సిద్ధిరామన్న, ఢిల్లీ కార్పొరేటర్ ఊర్మిల, యూపీ, ఎంపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరెకటిక సంఘాలు మద్దతు తెలిపాయి.
ధర్నాలో పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్యాణ్‌కార్ ఈశ్వర్‌చౌదరి, కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరెకటికలను ఎస్సీల్లో చేర్చాలి
Published Wed, Dec 18 2013 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement