
58 కంపెనీలను అమ్మిన సంగతి గుర్తులేదా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్ బిజినెస్‌మ్యాన్ అవార్డు వచ్చిందని, దానికి నిజంగా ఆయన అర్హుడేనని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 కంపెనీలను అమ్మేసిన విషయం ఆయనకు గుర్తులేదు గానీ, హైటెక్ సిటీ ఒక్కటి కట్టానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో ఇంత కంటే పెద్ద వ్యాపారమే జరుగుతోందని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీకి ప్రభుత్వం భూమి ఇవ్వడమే కాక, 12వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని చెప్పారు. అందులో 3137 కోట్లు అంతర్గత మౌలిక సదుపాయాలకు, మరో 5600 బయటి మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తోందన్నారు. వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా 12వేల కోట్లు ప్రభుత్వమే పెట్టుబడిగా పెడుతుంటే.. సింగపూర్ కంపెనీలు కేవలం రూ. 320 కోట్లు మాత్రమే పెడుతున్నాయని తెలిపారు. అయితే.. ఇంత పెడుతున్న ఏపీ సర్కారుకు కేవలం 42 శాతం, సింగపూర్ కంపెనీలకు మాత్రం 58 శాతం ఇస్తున్నారని అన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కుంభకోణమని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఎక్కడా పబ్లిక్ ఇంట్రెస్టు లేదని, ఉన్నదంతా ప్రైవేటు ఇంట్రెస్టేనని ఎద్దేవా చేశారు. ఇది స్విస్ చాలెంజా, చంద్రబాబు గారి సూట్‌కేసు చాలెంజా చెప్పాలన్నారు. ప్రభుత్వం వాళ్లకు ఇచ్చేది 1690 ఎకరాలు అయితే, అందులో 50 శాతం అంటే.. 845 ఎకరాలే తిరిగి వస్తాయని, వాటిని కనీసం ఎకరా 14 కోట్లకు అమ్మితేనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. కానీ, కేవలం 4 కోట్ల అప్‌సెట్ ప్రైస్‌కు ఇచ్చేయడం వెనక ఆంతర్యం ఏంటని గోవర్ధన రెడ్డి నిలదీశారు. వాళ్లు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు తిరిగి కట్టకపోయినా, 20 ఏళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా భరించేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమని.. అందులో లబ్ధి పొందేది మాత్రం సింగపూర్ కంపెనీలని తెలిపారు.
స్విస్ చాలెంజ్ లోపభూయిష్టం అని కేల్కర్ కమిటీ చెప్పినా ఇంతవరకు కేంద్రం దాన్ని పట్టించుకోలేదని అన్నారు. వీళ్ల వ్యవహారం అంతా గుర్రం వెనక బండి కాకుండా.. బండి వెనక గుర్రం కట్టినట్లుందని మండిపడ్డారు. ఇక నిబంధనల విషయంలోనూ మతలబులు జరిగాయని కాకాణి చెప్పారు. భారతదేశం బయట ఎక్కడైనా అనుభవం ఉండాలని, లే అవుట్ చేయాలని, దానికి మార్కెట్ చేసి ఉండాలని, బయట 25వేల మంది సిబ్బందిని నియమించి ఉండాలని నిబంధనలు పెట్టారని.. అంటే, కేవలం సింగపూర్ కంపెనీని రంగంలోకి తీసుకురావాలని వాళ్లకు ఉన్న అర్హతలను మాత్రమే నియమ నిబంధనలుగా పెట్టారని తెలిపారు. అసలు స్విస్ చాలెంజ్ విధానమే లోపభూయిష్టం అంటే.. కనీసం అందులో పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా పట్టించుకోలేదని, వీటిని ఏమీ ఆలోచించకుండా బరితెగించిన పద్ధతిలో చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు కోర్టులో హౌస్ మోషన్ తిరస్కరించారు కాబట్టి రేపు లంచ్ మోషన్ అంటున్నారని, ఏది ఏమైనా రాష్ట్ర సంపదను దోచుకోవాలి తప్ప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వాళ్లు మానసికంగా సిద్ధపడిపోయారని అన్నారు. ఎలాగోలా అప్పీలుకు వెళ్లి దాన్ని నసాగిస్తామంటున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాల మీద, తాము వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని గోవర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.