'చంద్రబాబు పిరికి సైనికుడు.. ముందే తెల్లజెండా'
అసెంబ్లీలో మొత్తం 36 అంశాలపై చర్చించాలని తాము నిర్ణయించినట్లు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి తెలిపారు. ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు, రాజధాని భూ కుంభకోణాలు, కరువు నివారణ చర్యల్లో వైఫల్యంతో పాటు మిగిలిన అంశాలను సభలో చర్చించాలన్నారు. ఇందుకోసం అసెంబ్లీని కనీసం 15-20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తీరును ఎండగడతామని స్పష్టం చేశారు.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందే తెల్లజెండా చూపించి వెనుదిరిగిన పిరికి సైనికుడు చంద్రబాబని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన సమయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి నిలదీశారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ప్రకటించగలరా అని సవాలు చేశారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు వెనకడుగు వేస్తే.. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని, హోదా రాకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబు నేరస్తుడిలా తలదించుకోవడం ఏపీ ప్రజలకు అవమానమే అవుతుందన్నారు. ఆడియో టేపులలో ఉన్నది తన గొంతు కాదని కేసీఆర్‌కు చంద్రబాబు సవాలు విసరాలని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి అన్నారు.