'చంద్రబాబు అవినీతి పాలనకు 100 మార్కులు'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి పాలనకు చంద్రబాబుకు 100 మార్కులు వేయొచ్చని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన మూడు రంగాల్లో కనీసం ఒక శాతం అభివృద్ధి కూడా జరగలేదని బొత్స ధ్వజమెత్తారు. దోపిడీ కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను కట్టారని ఆయన ఆరోపించారు. వ్యవసాయంపై అసలు కార్యాచరణే రూపొందించలేదని, ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి రాలేదని, లక్షల కోట్ల ఎంఓయూలు ఏమయ్యాయని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.
2016 ఏడాదిలో చంద్రబాబు పాలన అవినీతి మిన్నగా ఉందని బొత్స ధ్వజమెత్తారు. అభివృద్ది సున్నా రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. చంద్రబాబు రెండంకెల వృద్ది రేటు అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ది, వృద్ది రేటు లెక్కల్లో తప్ప వాస్తవంగా ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో పంచ భూతాలను టీడీపీ నేతలు పంచుకు తింటున్నారని, కేవలం అయిదు శాతం మాత్రమే వృద్ది రేటు ఉందన్నారు. అయితే12 శాతం అంటూ దొంగ లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
వృద్ది రేటు ప్రకటనలు అన్నీ బోగస్ అని దానిపై తాము బహిరంగ చర్చకు సిద్దమన్నారు. మంత్రులు, టీడీపీ నేతల వృద్ది రేటు పెరిగింది కాని రాష్ట్రం వృద్ది రేటు పెరగలేదని బొత్స అన్నారు. దోపిడీ కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని,వ్యవసాయం అంటే దండగ అనే భావన ముఖ్యమంత్రికి ఉంది కాబట్టే వ్యవసాయంపై చిన్న చూపు చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతృప్తి చెందడం లేదని,రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని అన్నారు.
వృద్ది రేటు కాదని, క్రైమ్ రేటు పెరుగుతుందని బొత్స అన్నారు. ఎక్కడ చూసినా కల్తీ మాఫియాలే అని వ్యాఖ్యలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధిని మంత్రి రావెల కిశోర్ బాబు వేధిస్తే చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలచే దమ్ముంటే రాజీనామా చేయించాలని బొత్స సవాల్ విసిరారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.