
‘అందుకే ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు’
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఆకాంక్షను ఎవరూ అడ్డుకోలేరని వైఎస్సార్ సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ప్రజలు, ప్రవాసాంధ్రులు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ అనేక ఆందోళనలు, ధర్నాలు చేసిందని తెలిపారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజెప్పామన్నారు.
ప్రవాసాంధ్రుల కోరిక మేరకే వైఎస్ జగన్ వారితో స్వయంగా మాట్లాడేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు, టీడీపీ నాయకులకు మేలు చేసేందుకే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసేందుకు వెనుకాడడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్ష, సెంటిమెంట్ ను అడ్డుకోవడం సబబు కాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.