మమ్మల్ని క్షమించండి..
Published Sat, Jan 11 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
న్యూఢిల్లీ: ‘ తప్పిదం జరిగింది. మేం అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు జనతాదర్బార్‌కు వచ్చారు. వారికి సరిపడా ఏర్పాట్లు చేయడంలో మేం విఫలమయ్యాం..ఈసారికి మమ్మల్ని క్షమించండి.. మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుం టాం..ఈ రోజుకి అందరూ ఇళ్లకు వెళ్లిపోండి..’ అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆప్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొట్టమొదటి ‘జనతాదర్బార్’ రసాభాసగా ముగిసిన విషయం తెలిసిందే. వందలాదిమంది ఒకేసారి తమ ఫిర్యాదులు సీఎంకు ఇచ్చేందుకు యత్నిం చడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేకపోయారు. తాకిడి తట్టుకోలేక సీఎం దర్బార్ మధ్యలోనుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం ఆయ న తిరిగి సెక్రటేరియట్ బయటకు వచ్చి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
కాగా గందరగోళం సద్దుమణిగిన తర్వాత కేజ్రీవాల్ మంత్రివర్గ సభ్యులైన మనీష్ ససోడియా, రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీలు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారికి రసీదులు ఇచ్చారు. వారి చెప్పిన విషయాలను సాదరంగా విన్నారు. అలాగే డీడీఏ, పోలీ స్, మూడు ఎంసీడీల నుంచి పలువురు సీని యర్ అధికారులు సైతం ఈ దర్బార్‌కు హాజరయ్యారు. అయితే ఇంత గందరగోళంలోనూ కొన్ని వందల మంది తమ ఫిర్యాదులను దర్బార్‌లో అందజేయగలిగారు. ఉదయం 6 గంటలకే సెక్రటేరియట్‌కు చేరుకున్న తూర్పుఢిల్లీలోని మండవలీ ప్రాంతానికి చెందిన సునీతా అగర్వాల్ మాట్లాడుతూ..‘ మా ఇంటిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ విషయమై సీఎంకు వినతిపత్రం ఇచ్చా. ఆయన తొందర్లోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..’ అని చెప్పారు. రేడియో ట్యాక్సీ డ్రైవర్ల సమస్యపై తాను ఇచ్చిన వినతిపై రవాణా మంత్రి సౌరభ్ సానుకూలంగా స్పందించారని,
త్వరలోనే చర్చలకు పిలుస్తానని హామీ ఇచ్చారని ఎకానమీ రేడియో ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మురళీధర్ తెలి పారు. జనతాదర్బార్‌లో గందరగోళం వల్ల చాలామంది సీఎంను కలవలేకపోయారు. ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ సీఎం కేజ్రీవాల్‌ను కలిసి గులాబీని బహుమతిగా ఇవ్వాలని వచ్చిన 24 ఏళ్ల మమతా శర్మ అనే వికలాంగురాలు సెక్రటేరియట్ గేట్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటల వరకు వేచి ఉంది. ఆమె మాట్లాడుతూ..‘ కేజ్రీవాల్ నాకు ఆదర్శం. నేను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకుంటున్నాను. అతడిని కలిసి ఈ గులాబీ ఇచ్చి అభినందించాలని వచ్చా.. అయితే ఇంతమందిలో నా అంగవైకల్యం వల్ల అతడిని కలవలేకపోయాను. నేను ఉదయం ఇక్కడికి వచ్చినపుడు ఈ పువ్వు చాలా తాజాగా ఉంది. ఇప్పుడుచూడండి.. రెక్క లు రాలిపోయా’ని ఆమె వ్యాఖ్యానించారు.
‘మా అందరి పరిస్థితీ ఇలాగే ఉంది.. ఇక్కడ ఒక పద్ధతి లేదు.. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు.రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చాను. కాని సీఎంను కలవలేకపోయాను. మున్ముందైనా మహిళలు, వికలాంగులు, వృద్ధుల కోసం సీఎం ప్రత్యేక ఏర్పాట్లు చేయించాలని కోరుతున్నాను..’ అని మరో వికలాంగుడు తెలిపాడు. ఎలక్ట్రిక్ వీల్ చైర్‌లో వచ్చిన బిట్టో అనే మరో వికలాంగుడు మాట్లాడుతూ ‘నాకు పోలియో ఉండటంతో ఎవరూ పని ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. సొంతంగా దుకాణం పెట్టుకోవాలని అనుకొన్నాను. ఇంతకుముందు సీఎం షీలాదీక్షిత్‌ను కలుద్దామనుకున్నా సాధ్యం కాలేదు.
ఇప్పుడు కేజ్రీవాల్‌ను కలవడానికి వచ్చాను. కలవలేకపోయాను..దురదృష్టం వెంటాడుతూనే ఉంద’ని వాపోయాడు. 2013, డిసెంబర్ 19 సామూహిక అత్యాచారానికి గురైన మహిళ సైతం సీఎంను కలవడానికి కుటుంబసభ్యులతో వచ్చింది.‘ నేను కేసు పెట్టాను. ఇద్దరి నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాని వారిని అరెస్టు చేయలేదు. వారు రోజూ వచ్చి మమ్నల్ని బెదిరిస్తున్నారు..’ అని ఆమె సోదరుడు ఫిర్యాదుచేశాడు. న్యాయశాఖ మంత్రి సోమంత్ భారతి ఆదేశానుసారం పోలీసులు ఆమెను ఐటీవో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
Advertisement
Advertisement