కేజ్రీవాల్ తొలి జనతా దర్బార్ | Arvind Kejriwal's First Janata Darbar in Second Term as Chief Minister | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ తొలి జనతా దర్బార్

Published Wed, Feb 18 2015 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

Arvind Kejriwal's First Janata Darbar in Second Term as Chief Minister

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం మొట్టమొదటిసారిగా జనతాద ర్బార్ నిర్వహించారు. ఇందులోభాగంగా ఘాజియాబాద్‌లోని కౌశాంబీలో గల ఆప్ కార్యాలయం వద్ద ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు ప్రజా సమస్యల్ని ఆలకించారు. ఈ దర్బార్‌కు దాదాపు దాదాపు  వెయ్యి మంది ప్రజలు వచ్చారు. వారిలో కొందరు తమ సమస్యల్ని చెప్పుకోగా, మరికొందరు సీఎంకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. మరికొందరు ఫొటోలు దిగారు. ఈ దర్బార్‌కు వచ్చిన వారి సమస్యలను ముఖ్యమంత్రి ఓపిగ్గా ఆలకించారు. ఫిర్యాదుల్లో అత్యధికం పోలీసులకు సంబంధించినవేనని అధికారులు చెప్పారు.

12 గంటల తరువాత కేజ్రీవాల్  జనతా దర్బార్ ముగించి సచివాలయానికి బయల్దేరారు. జనతాదర్బార్‌లో గందగోళం తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వాధికారులతోపాటు ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు. ఇదిలాఉంచితే జాతీయ రాజధానిలో అధికారిక నివాసం లభించేంతవరకు కేజ్రీవాల్ కౌశాంబీలోనే వారానికి మూడు రోజులు జనతాదర్బార్ నిర్వహిస్తారని తెలియవచ్చింది. బుధ, గురు, శుక్రవారాలు జనతాదర్బార్ నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు అనుమతించారు. ఇందులోభాగంగా భద్రతతోపాటు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంవల్లనే బుధవారం జనతాదర్బార్‌కు తక్కువమంది వచ్చారని, మున్ముందు వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు .

ఇక మంత్రులు కూడా కార్యాలయాలలో కాకుండా తమ విధానసభ నియోజకవర్గం పరిధిలోని తమ కార్యాలయాల్లో ప్రజలను కలుస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాగా గతంలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి సచివాలయం వద్ద జనతాదర్బార్ నిర్వహించిన జనతాదర్బార్ రసాభసగా మారిన సంగతి విదితమే. దీంతో ఆప్ సర్కారు, ప్రభుత్వ అధికారులు ఈసారి మెరుగైనఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ వద్ద అనేక  విభాగాలు ఉండేవి. అయితే ఈసారి తన వద్ద ఏ మంత్రిత్వ శాఖను ఉంచుకోలేదు.ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి తగినంత సమయం ఉంటుందని ఆప్ వర్గాలు అంటున్నాయి. ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగాన్ని  నిర్థారించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు.

ముున్సిపల్ సంస్థలకొకరోజు, డీజేబీ సమస్యలకు ఒకరోజు, విద్యుత్తు సమస్యలకు ఒకరోజు... ఇలా వేర్వేరు రోజుల్లో  ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. అన్నిరకాల సమస్యలతో ప్రజలు ఒకే రోజు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినట్లయితే గందరగోళం తలెత్తవచ్చని, ఈ కారణంగా ఎవరికీ సంతృప్తి కలగకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదుదారులకు ఎస్‌ఎంఎస్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో జనతా దర్బార్లు నిర్వహించే దిశగా ఆప్ సర్కారు యోచిస్తోందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలోనే జరుగుతాయని అంటున్నారు. ఆప్ మంత్రులు  సత్యేంద్ర జైన్, జితేంద్రసింగ్ తోమర్ బధవారం తమ కార్యాలయాల్లో ప్రజలను కలసి వారి సమస్యలను ఆలకించారు.

సత్యేంద్ర జైన్ సరస్వతీ విహార్‌లోని తన కార్యాలయంలో ఉదయం  నుంచి ప్రజలను కలవడం ప్రారంభించారు. దాదాపు 150 మంది ఆయనను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి   సత్యేంద్రజైన్ వద్దకు వచ్చినవారిలో ఎక్కువ మంది సర్సరీ ప్రవేశాలకు సంబంధించి ఫిర్యాదులను అందజేశారు. మంత్రి తమ సమస్యలను ఓపికగా విన్నారని, ఆయనను కలవడానికి వచ్చినవారు చెప్పారు. తొలిసారిగా మంత్రి బాధ్యతలను చేపట్టిన జితేంద్ర సింగ్‌తోమర్ కూడా  ఉదయం తొమ్మిది గంటలకే తన కార్యాలయానికి వచ్చి ప్రజలను కలిశారు. న్యాయశాఖ మంత్రి అయిన తోమర్ వద్దకు వచ్చిన వారిలో కొందరు సమస్యలను చెప్పుకోగా, మరికొందరు ఆయనను అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement