ప్రయాణికులకు చార్జీల చిట్టా
Published Wed, Sep 4 2013 6:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
ఆటోచార్జీల వివరాలతో కూడిన ప్యాకెట్ చిట్టాను ప్రయాణికులకు పంపిణీ చేయనున్నారు. రెండు లక్షల చిట్టాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. మరోవైపు ఆటో కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి జయలలితతో మంగళవారం భేటీ అయ్యాయి. ఆటోలకు చార్జీలు ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపాయి.
సాక్షి, చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెన్నైలో నిర్ణీత ఆటోచార్జీల్ని ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. కనీస చార్జీగా రూ.25 నిర్ణయించింది. అలాగే 1.8 కిలోమీటర్ల అనంతరం ప్రతి కిలోమీటర్‌కు రూ.12 తీసుకోవాలి. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మీటరుపై యాభై శాతం అదనపు చార్జీ వసూళ్లు చేసుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకు వెయిటింగ్ చార్జీ 3.50 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే జీపీఎస్, బిల్లింగ్ సౌకర్యంతో కూడిన మీటర్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీలోపు చార్జీలను అమలు చేయడమే లక్ష్యంగా రవాణాశాఖ కసరత్తులు చేస్తోంది. చెన్నై మహానగరంలో 77 వేల వరకు ఆటోలు ఉన్నాయి. చార్జీల వివరాలతో కూడిన కరపత్రాల్ని ట్రాఫిక్, రవాణా సిబ్బంది ద్వారా ఆటోడ్రైవర్లు, యజమానులకు సిబ్బంది అందజేస్తున్నారు.
ప్యాకెట్ చిట్టా
చార్జీలపై ప్రయూణికులకు సైతం అవగాహన కల్పిం చేందుకు రవాణాశాఖ నిర్ణయించింది. ప్యాకెట్ క్యాలెం డర్ తరహాలో చిట్టాను సిద్ధం చేసింది. తొలి విడతగా నగరంలో రెండు లక్షల ప్యాకెట్ చిట్టాల్ని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంది. అలాగే ప్రయూణికులతో వ్యవహరించాల్సిన తీరుపై ఆటోడ్రైవర్లకు శిక్షణ ఇచ్చేం దుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
ముఖ్యమంత్రితో భేటీ
ఆటోచార్జీలు ఖరారు చేయడం పట్ల ఆటో సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సంఘాల నేతలు ముఖ్యమంత్రి జయలలితతో మంగళవారం భేటీ అయ్యారు. రవాణాశాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, ఏఐటీయూసీ అనుబంధ ఆటో కార్మిక సంఘం, మద్రాసు మెట్రో ఆటో కార్మిక సంఘం, ఐఎన్‌టీయూసీ తదితర సంఘాల నాయకులు శేషసాయి, లక్ష్మణన్, మారియప్పన్, స్వామినాథన్, అశోకన్ తదితరులు హాజరయ్యూరు.
ఆటోచార్జీలు ఖరారు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు జయలలిత సానుకూలంగా స్పందించారు. చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ భేటీ అనంతరం ఆటో కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల్ని ఇంత వరకు ఏ ముఖ్యమంత్రీ ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. తమతో జయలలిత సమావేశం కావడం సంతోషంగా ఉందని చెప్పారు.
Advertisement