కరుణపై మరో దావా, విజయకాంత్‌కు అరెస్ట్ వారెంట్ జారీ | Another defamation case against Karunanidhi, Arrest warrant to vijayakanth | Sakshi
Sakshi News home page

కరుణపై మరో దావా, విజయకాంత్‌కు అరెస్ట్ వారెంట్ జారీ

Published Fri, Sep 13 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

Another defamation case against Karunanidhi,  Arrest warrant to vijayakanth

డీఎంకే అధినేత కరుణానిధిపై ముఖ్యమంత్రి జయలలిత మరో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను ఆమె తరపున కార్పొరేషన్ న్యాయవాది ఎం.ఎల్.జగన్ బుధవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. అలాగే డీఎండీకే అధినేత విజయకాంత్‌కు తంజావూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 
 
 సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు ఎవరు చేసినా పరువు నష్టం దావాల  మోత మోగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌పై రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో కేసులు దాఖలై ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై రెండేళ్ల కాలంలో పది పరువు నష్టం దావా పిటిషన్లను జయలలిత దాఖలు చేశారు. ఈ పిటిషన్లలో కొన్నింటి నుంచి కరుణకు విముక్తి లభించింది. మరికొన్ని పిటిషన్ల విచారణకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా కరుణానిధిపై 11వ పిటిషన్‌ను జయలలిత బుధవారం దాఖలు చేశారు. 
 
 ఇదీ కారణం
 కార్పొరేషన్ న్యాయవాది ఎం.ఎల్.జగన్ చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో బుధవారం ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో మద్రాసు వర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు హాయిగా నిద్రపోయారంటూ కల్పిత చిత్రాలతో మురసోలి పత్రిక కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. ఆమె ప్రసంగాన్ని మంత్రులు వింటూ ఉంటే వాళ్లందరూ నిద్ర పోయినట్టు కథనాన్ని ప్రచురించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టకు భంగం కలిగించారని వివరించారు. ఈ దృష్ట్యా కరుణానిధిపై సెక్షన్ 500, 501 కింద పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి చొక్కలింగం త్వరలో విచారణ చేపట్టనున్నారు. 
 
 కెప్టెన్‌కు అరెస్ట్ వారెంట్
 ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌కు తంజావూరు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కెప్టెన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని గత ఏడాది అన్ని జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆయనకు అనేక కోర్టులు పీటీ వారెంట్ జారీ చేశారుు. కోర్టుకు డుమ్మా కొడుతూ వస్తున్న విజయకాంత్‌పై తంజావూరు కోర్టు బుధవారం కన్నెర్ర చేసింది. మూడు వాయిదాలకు ఆయన రాకపోవడంతో న్యాయమూర్తి సేతుమాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో జిల్లా కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నందునే ఇక్కడి రాలేదంటూ విజయకాంత్ తరపు న్యాయవాదులు వాదించినా ఫలితం లేకపోయింది. విజయకాంత్‌ను కోర్టులో హాజరు పరచాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement