తంజావూరు కోర్టుకు డీఎండీకే అధినేత విజయకాంత్
Published Thu, Sep 19 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసు విచారణ నిమిత్తం తంజావూరు కోర్టుకు డీఎండీకే అధినేత విజయకాంత్ బుధవారం హాజరయ్యారు. ఎన్ని కేసులు వేసినా తాను మాత్రం వెనక్కు తగ్గబోనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత తరపున విజయకాంత్‌పై జిల్లాకో పరువు నష్టం దావా దాఖలైన విషయం తెలిసిందే. వీటి విచారణ నిమిత్తం ఏడాదిగా కోర్టుల చుట్టూ కెప్టెన్ తిరుగుతున్నారు. కొన్ని కోర్టుల మెట్లు ఎక్కడంలో ఆలస్యమవుతోంది. దీంతో న్యాయమూర్తులు ఆగ్రహం చెందుతున్నారు.
అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నారు. కెప్టెన్ గైర్హాజరుపై తంజావూరు కోర్టు గత వారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట విజయకాంత్ బుధవారం హాజరయ్యారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్‌కు పోలీసులు ఈసారి గట్టి భద్రతే కల్పించారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆయన ఉదయం తంజావూరు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
వెనక్కు తగ్గను
కోర్టు బయట మీడియూతో విజయకాంత్ మాట్లాడారు. చాలా రోజుల తర్వాత గట్టి భద్రత నడుమ కార్యకర్తల్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తనకు భద్రత కల్పించని దృష్ట్యా విచారణలకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తనపై వందల కేసులు నమోదై ఉన్నాయని, వీటన్నింటినీ ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కేసులను ఎదుర్కోవడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఢీకొట్టడంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎన్ని కేసులు వేసినా, కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా తాను భయపడబోనన్నారు.
Advertisement