భద్రత పెంపు | Chennai bomb blasts: Security tightened at sensitive | Sakshi
Sakshi News home page

భద్రత పెంపు

Published Thu, May 1 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

Chennai bomb blasts: Security tightened at sensitive

న్యూఢిల్లీ: నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం చెన్నైలో వరుస రెండు బాంబు పేలుళ్లు జరగడంతో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని రైల్వే స్టేషన్‌లు, బస్సు స్టేషన్‌లు, రద్దీ మార్కెట్లు, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మొహరించారు. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని సోదా చేశారు.  అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని విచారించారు. ఒకవైపు మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భద్రతపైనే పోలీసులు ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో మైక్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే పోలీసులకు తెలపాలని జాగృతం చేసే ప్రయత్నం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను రెండింతలు చేశామని ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి రాజన్ భగత్ గురువారం విలేకరులకు తెలిపారు. ఇది రెడ్ అలర్ట్ పరిస్థితి కాదన్నారు.  నిఘావర్గాల నుంచి ఏదైనా ప్రత్యేక హెచ్చరికలు వస్తే రెడ్ అలర్ట్ ప్రకటిస్తామని, ఇప్పడు అలాంటిదేమీ లేదన్నారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో బెంగళూరు-గౌహతి రైలు రెండు కోచ్‌ల్లో వెంటవెంటనే పేలుళ్లు జరగడంతో ఒక మహిళ మృతి చెందగా, 14 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
 
 ఢిల్లీ మెట్రోకు బాంబు బెదిరింపు
 మెట్రో రైలులో బాంబు ఉందని గురువారం వచ్చిన బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ‘అప్పటికే చెన్నైలో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. మెట్రో రైలులో బాంబు ఉందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఢిల్లీ మెట్రో కంట్రోల్ రూమ్‌కు ఉదయం 10.15 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేశామ’ని కేంద్ర పారాశ్రామిక భద్రత దళం(సీఐఎస్‌ఎఫ్) అధికార ప్రతినిధి హేమేంద్ర సింగ్ గురువారం విలేకరులకు తెలిపారు. వివిధ మెట్రో స్టేషన్‌లు, రైళ్లలో సోదాలు చేశామని, అయితే చివరికది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తెలిసిందన్నారు. చెన్నైలో బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే అన్ని మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఇందర్‌లోక్-రితాలా మార్గంలో ఉదయం 11 గంటలకు రైళ్ల సేవలకు స్వల్ప అంతరాయం కలిగిందని, అయితే అది సిగ్నల్ సమస్య వల్లే జరిగిందని చెప్పారు. బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ఢిల్లీ పోలీసులకు ఇచ్చామని తెలిపారు. ఆ నంబర్ ఎవరిదా అని తెలసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ భాటియా వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేస్తామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement