సీకే బాబుపై కాల్పుల కేసు కొట్టివేత
సీకే బాబుపై కాల్పుల కేసు కొట్టివేత
Published Mon, Mar 13 2017 12:14 PM | Last Updated on Mon, Aug 13 2018 3:16 PM
2007లో సీకే బాబు లక్ష్యంగా కాల్పులు
గన్‌మెన్, ఉద్యోగి, దుండగుడు మృతి
57 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లక్ష్యంగా చేసుకుని 2007లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసును చిత్తూరులోని 9వ జిల్లా అదనపు, సెషన్స్ న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీకే అంగరకక్షుడితో పాటు ఓ మున్సిపల్ ఉద్యోగి, ఆగంతకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు పదేళ్ల పాటు విచారణ అనంతరం సోమవారం ఈ ఘటనపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.
కేసు వివరాలు...
2007, ఫిబ్రవరి 9.. సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో ఉన్న క్లబ్‌కు వెళ్లడం సీకేకు అలవాటు. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నా సీకే క్లబ్ వద్ద ఉన్న తన గదిలో అనుచరులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇంతలో తుపాకులతో వచ్చిన ఓ ఆగంతక ముఠా గది వద్ద ఉన్న గన్‌మెన్ (ఏఆర్ కానిస్టేబుల్) హుస్సేన్ భాషను తుపాకీతో కాల్పి చంపారు. అక్కడి నుంచి సీకే ఉన్న గదిలోకి వెళ్లారు. సీకే ఆయన అనుచరులు గడ్డాలతో ఉండటంతో లోపలికి వెళ్లిన దుండగులు ఎవర్ని కాల్పాలో తెలియక అందరిని గురిపెట్టారు. ఒక్క సారిగా కాల్పుల శబ్దం. కొంత మంది పరుగులు తీశారు. చిత్తూరు మునిసిపాలిటీలో పనిచేస్తున్న నావరసు అనే ఉద్యోగి దుండగుల తూటాకు బలయ్యాడు. ఆగంతకుల్లో ఓ వ్యక్తిని సీకే అంగరక్షకులు మట్టుపెట్టారు. కాలికి బుల్లెట్ తగిలి ఓ వ్యక్తి, మరి కొంత మంది పారిపోయారు. సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు.
వీళ్లపై కేసులు...
2005 లో అప్పటి కౌన్సిలర్, టీడీపీ నేత కటారి మోహన్‌పై జరిగిన హత్యాయత్నానికి ప్రతీకారంగా సీకేపై కాల్పులు జరిగాయని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా కటారి మోహన్, మోహన్ మేనల్లుడు చింటూ (మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు), సతీష్‌బాబు, పటాన్ సర్దార్, కటారి ప్రవీణ్ (కటారి మోహన్ కుమారుడు), శాంతకుమార్, అమర్‌నాద్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజ, వెంకటాచలపతి, జలగం మురళి, త్రివిక్రమ్, ఏకాంబరంలు ఈ కుట్రలో పాలు పంచుకున్నారంటూ అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేసి అందర్నీ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల్లో కటారి మోహన్, శాంతకుమార్ చనిపోయారు. కాల్పులు జరిగినప్పుడే రాజా అనే వ్యక్తి కాలికి బుల్లెట్‌గాయం తగలడంతో పారిపోగా.. అతని ఆచూకీ తెలియరాలేదు. మొత్తం 94 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు.
Advertisement
Advertisement