ముంబై : రాష్ట్రం క్రిస్మస్ శోభను సంతరించుకుంది. పండుగను పురస్కరించుకుని ముంబైతో పాటు అన్ని జిల్లాల్లోని ప్రధాన చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. మరోవైపు ముంబైలోని ప్రముఖ మార్కెట్లలో క్రిస్మస్ కొనుగోళ్ల సందడి పందుకొంది. నగరంలోని క్రైస్తవులంతా ఇప్పటికే పండుగ కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. ప్రత్యేకించి క్రిస్మస్ ట్రీతో పాటు ఇతర గృహాలంకరణ వస్తువుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
కరుణామయుడి అవతరణే...క్రిస్మస్
యేసు క్రీస్తు జననం ప్రపంచగమనాన్నే మార్చింది. క్రీస్తు పుట్టుకను ఆధారంగా చేసుకుని.. ఈ కాలాన్ని క్రీస్తుపూర్వం, క్రీస్తుశకంగా పరిగణిస్తున్నారు. భగవంతుడు ఇజ్రాయేలు దేశంలోని బెత్లెహాంలోని పశువుల పాకలో ఓ సామాన్య మానవుడిలా రెండు వేల ఏళ్లకు పూర్వం జన్మించిన రోజునే క్రిస్మస్‌గా జరుపుతున్నారు. 33 ఏళ్లు జీవించి మానవుల పాప విమోచన కోసం తన ప్రాణాలనే శిలువపై అర్పించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును ప్రజలు లోకరక్షకుడిగా కొలుస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా వివిధ చర్చిల్లో ఆచరించే విధానం వేర్వేరుగా ఉంటుంది. క్రీస్తు జననాన్ని గుర్తుకు తెస్తూ చిన్నారులు నాటికలు ప్రదర్శిస్తుంటారు. చర్చిల్లో క్రీస్తు జన్మించిన పశువుల పాకలను ఏర్పాటు చేశారు. అందులో బాలయేసు, ముగ్గురు జ్ఞానుల రాక, క్రీస్తు జననాన్ని ముందు నుంచి చెబుతూ వస్తున్న గాబ్రియేలు దేవదూత, క్రీస్తు జననాన్ని చాటుతూ ఆకాశంలో ప్రత్యక్షమైన వేగు చుక్క (స్టార్), గొర్రెల కాపరుల హడావుడి ప్రస్ఫుటించేలా ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఏటా డిసెంబర్ 24వ తేదీ రాత్రి10 గంటల నుంచి చర్చిలో ప్రార్థనలు ప్రారంభమై మరుసటిరోజు ఉదయం వరకు కొనసాగుతాయి. 24న రాత్రి 12 గంటలకు భక్తులు క్రీస్తు జననాన్ని చాటుతూ కొవ్వొత్తులు చేతబట్టి పాటలు పాడుతూ అన్ని వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తోంది.
క్రిస్మస్‌తాత బహుమతుల కోసం..
క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్‌తాత(శాంటాక్లాజ్) తప్పక గుర్తుకు వస్తారు. ఆయన నుంచి బహుమతులు అందుకోవాలని పిల్లలతో పాటు పెద్దలు ఎదురుచూస్తారు. సెయింట్ నికొలస్ అనే సన్యాసి టర్కీ దేశంలోని నేటి పాటరా (మైరా ప్రాంతం) వద్ద జన్మించారు. ఆయన తోటివారిపై దయ, జాలి, కరుణను చూపించేవారు. ఆయన తన ఆస్తి మొత్తం పేద ప్రజలకు దానం చేస్తుండేవారు. ఆపన్నులకు, రోగులకు, నిస్సహాయులకు తనవంతు చేయూతనిచ్చేవారు. నిత్యం ఎరుపు రంగు కోటు, టోపీ ధరించి వీధుల్లో సంచరిస్తుండేవారు. పిల్లలకు బహుమతులు ఇవ్వడమంటే ఆయన కెంతో ఇష్టం. ముఖ్యంగా డిసెంబర్‌లో రాత్రిపూట మంచి పిల్లల ఇళ్లకు వెళ్లి వారి ఇళ్ల ముంగిట్లో బహుమతులు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. ఆయననే కాలక్రమేణా క్రిస్మస్‌తాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన చనిపోయిన డిసెంబర్ 6వ తేదీని ఏటా నికొలస్‌డేగా జరుపుకుంటున్నారు.
పశువుల పాకలో జననం
యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించారు. ఈ పశువుల పాకలను ప్రతి చర్చిలో ఏర్పాటు చేశారు. ఈ పాకలో బాల యేసు, క్రీస్తు తల్లిదండ్రులు, ముగ్గురు జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు తీసుకురావడం, ఆకాశంలో వెలసిన నక్షత్రం.. బాల యేసు ఉన్న పశువుల పాకపై తన వెలుగును ప్రసరింపజేయడం, ఈ వెలుగుల ఆధారంగా ముగ్గురు జ్ఞానులు క్రీస్తు ఉన్న ప్రాంతాన్ని వెతుక్కుంటూ రావడం వంటి సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా ఉన్న దృశ్యాలు కన్పిస్తాయి. గొర్రెల కాపరులకు గాబ్రియేలు దేవదూత కనిపించి మీ కోసం రక్షకుడు పుట్టాడని చెప్పగానే వారు గొర్రెపిల్లలను బహుమతిగా తేవడాన్ని గుర్తుకు తెచ్చే సంఘటనలు ఇక్కడ కనిపిస్తాయి. క్రీస్తు పుట్టుకను తెలియజేస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన ప్రతినిధులను పద్ధతి ప్రకారం తీర్చిదిద్దుతారు.
క్రిస్మస్ ట్రీల అలంకరణ
ఎప్పుడూ పచ్చగా ఉండే పైన్ (ఫిర్), స్ప్రూస్ జాతికి చెందిన మొక్కను క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మొక్కను ఆపిల్ బైబిల్‌లోని వాక్యాలను తెలియజేస్తూ వాగ్దానాలను, దేవదూత, నక్షత్రం బొమ్మలను కట్టి ప్రత్యేక ఆకర్షణగా అలంకరిస్తారు. కొన్ని చోట్ల సరుగుడు మొక్కలను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తారు.
రాష్ట్రానికి క్రిస్మస్ శోభ
Published Mon, Dec 23 2013 10:58 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement