పళ్లిపట్టు: ఉపాధ్యాయుడు భగవాన్‌పై విద్యార్థుల ప్రేమ పోరాటానికి సంబంధించి సినిమా తీసేందుకు వీలుగా సినీ డైరెక్టర్లు ఇద్దరు శుక్రవారం వెలిగరం పాఠశాల్లో భగవాన్‌ను కలిసి చర్చలు జరిపారు. అదే సమయంలో డీఈఓ విచారణ, తమ ఉపాధ్యాయుడిని బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రిని కలిసిందుకు నిర్ణయించుకోవడంతో వెలిగరం పాఠశాల్లో శుక్రవారం సైతం హడావుడి చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం పాఠశాల్లో ఆంగ్లం బీటీ టీచర్ భగవాన్ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉండేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 35 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ నిష్పత్తిలో ఉండాలి. అయితే వెలిగరం పాఠశాల్లో 280 మంది విద్యార్థులకు ప్రస్తుతం 19మంది టీచర్లు (తెలుగు మీడియం ఉపాధ్యాయులతో కలిపి) ఉన్నారు.
వారిలో టీచర్ పోస్టులో ఉన్న జూనియర్లను స్థాన చలనం చేయాల్సి రావడంతో ఇద్దరు టీచర్లను వేర్వేరు పాఠశాలకు బదిలీ చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించారు. అయితే భగవాన్ బదిలీ సమాచారంతో పాఠశాల విద్యార్థులు చలించి తరగతులు బహిష్కరించి ప్రేమ పోరాటం నిర్వహించిన విషయం తెలిసిందే. బదిలీ అయ్యేందుకు పాఠశాలకు వచ్చిన భగవాన్‌ను విద్యార్థులు చుట్టిముట్టి తమ పాఠశాలను వీడి వెళ్లరాదని బోరున విలపించడంతో విద్యార్థుల ప్రేమకు చలించిన టీచర్ సైతం విలపించారు. విద్యార్థులు గ్రామీణుల కోర్కె మేరకు కొద్ది రోజుల పాటు బదిలీ నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం భగవాన్ యథావిధిగా వెలిగరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. ఈ స్థితిలో ఉదయం పది గంటల సమయంలో చెన్నైకు చెందిన సినిమా డైరెక్టర్లు ఇద్దరూ పాఠశాలకు వెళ్లి భగవాన్‌కు కలుసుకుని విద్యార్థులు, టీచర్ అనుబంధం మీద సినిమా తెరకెక్కించడంపై మంతనాలు జరిపారు.
అదే సమయంలో పాఠశాలకు చేరుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి అరుల్‌సెల్వం ప్రధానోపాధ్యాయులు అరవింద్ సహా 18 మంది ఉపాధ్యయులతో సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారికి సమర్పించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అదే సమయంలో మరో వారంలో భగవాన్‌ను మరో పాఠశాలకు బదిలీ చేయనుండడంతో, బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టర్‌ను కలిసి వేడుకోవాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment