- దేవస్థాన చైర్మన్‌గా రామారావు ప్రమాణం
- ముఖం చాటేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
- తూతూమంత్రంగా కార్యక్రమం=స్థానిక విభేదాలే కారణం!
హనుమాన్‌జంక్షన్ రూరల్: హనుమాన్ జంక్షన్‌లోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బట్టబయలు అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడుకు చెందిన టీడీపీ నేత పావులూరి రామారావును పాలకమండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించగా, సోమవారం ప్రమాణ స్వీకారోత్సవానికి భారీఖర్చుతో ఏర్పాట్లు చేశారు.
రామారావు వర్గీయులు పట్టణ ప్రధాన రహదారుల్లో పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు కట్టి హడావుడి చేశారు. రామారావుకు మద్దతుగా దెందులూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వస్తున్నారని జోరుగా ప్రచారం చేశారు.
హాజరైన కొనకళ్ల, వల్లభనేని
ఇక కృష్ణాజిల్లా కోటాలో బాపులపాడుకు చెందిన మేడేపూడి రామ్మోహనరావుకు దేవస్థానం డెరైక్టర్ పదవి రావటంతో ఆయనకు అభినందనలు తెలిపేందుకు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వచ్చారు. బాపులపాడు టీడీపీ కార్యలయం నుంచి ఆలయానికి ర్యాలీగా వెళ్లి ఆలయ నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.
అయితే విప్ చింతమనేని రాలేదు. దీంతో వేదికపై జరగాల్సిన బహిరంగ ప్రమాణ స్వీకారం లేకుండానే కార్యక్రమాన్ని మమ అనిపించారు. అప్పనవీడు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాల వల్లే చింతమనేని ముఖం చాటేశారని, రామారావుకు పదవినివ్వడం ఆయనకు ఇష్టం లేదని ప్రచారం. ఎమ్మెల్యే గైర్హాజరుతో పావులూరి రామారావు వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. వైభవంగా జరుగుతుందనుకున్న కార్యక్రమం కాస్తా వర్గ రాజకీయాలతో చిన్నబోయింది.
దసరా రద్దీపై ఆర్టీసీ ఆర్‌ఎం సమీక్ష
విజయవాడ (బస్‌స్టేషన్): దసరా రద్దీలో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కృష్ణా రీజనల్ మేనేజర్ పీవీ రామారావు సిబ్బందికి సూచించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆయన సోమవారం పర్యటించారు. దసరా సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 11, 12 తేదీల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. 11వ తేదీన 102 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయనతోపాటు సీటీఏం శ్రీరాములు, జాన్‌సుకుమార్, ఏటీఏం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.