
ఇవీ పనులేనా?
బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)లో జరుగుతున్న నాణ్యత లేని పనులు మరెక్కడా లేవని ....
బీబీఎంపీలో నాణ్యతరహిత పనులపై సీఎం అసంతృప్తి
అధికారులను, ఇంజినీర్లపై సిద్ధు మండిపాటు
బెంగళూరు(బనశంకరి) : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)లో జరుగుతున్న నాణ్యత లేని పనులు మరెక్కడా లేవని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పనులు పర్యవేక్షిస్తున్న అధికారులను, ఇంజినీర్లపై ఆయన మండిపడ్డారు. నూతనంగా నిర్మించిన కర్ణాటక ఇంజినీర్ అకాడమి భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖతో పాటు వివిధ శాఖల్లో పథకాల అమలుకు సంబంధించి అంచనాకు మించి ఖర్చులు చూపి ప్రభుత్వానికి, పథకాలకు చెడ్డపేరు తీసుకురావద్దంటూ అధికారులకు హితవు పలికారు. వేస్తున్న రహదారులు మూడు నెలలు కూడా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
రూ. కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోందని మండిపడ్డారు. వ్యయం కాస్తా ఎక్కువ అయినా పనుల్లో నాణ్యత ఉండాలని అన్నారు. తాగునీటి పథకాల్లో టెండర్లకు మించి ఇంజినీర్లు రెట్టింపు నిధులు విడుదల చేస్తున్నారని దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇకపై ఇలా జరగరాదని హెచ్చరించారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత రోజుల్లో మూఢనమ్మకాలు ఇంకా వీడకపోవడంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.