‘అమ్మ ఆస్తుల’ టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సీఎం జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై ఈనెల 27న బెంగళూరు కోర్టులో తీర్పువెలువడనున్న దృష్ట్యా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలను కలిపే అన్ని రహదారుల్లో గురువారం నుంచే భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటూ ముమ్మర తనిఖీలు ప్రారంభమయ్యూయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 1991-96లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అరోపిస్తూ ఆ తరువాత (1996) అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి స్వామి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఏసీబీ, ఆదాయానికి మించి రూ.66.44 కోట్లను అమ్మ అక్రమంగా ఆర్జించినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో జయతోపాటూ ఆమె దత్తపుత్రుడు సుధాకర్, నెచ్చెలి శశికళ, బంధువు ఇళవరసిలను చేర్చారు. చెన్నైలో కొన్నాళ్లు విచారణ జరిగిన అనంతరం కేసు బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. అనేక విచారణల పిదప ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కోర్టును అగ్రహారం జైలు సమీపంలోకి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ కోర్టును కోరడంతో తీర్పు ఈనెల 27 వ తేదీకి వాయిదాపడింది.
రెండు రాష్ట్రాల్లో టెన్షన్
తీర్పు ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా ఏర్పాట్లపై ఉద్రిక్తత పోలీసు వర్గాల్లోనూ నెలకొంది. కర్ణాటక అదనపు పోలీస్ కమిషనర్ హరిహరన్, తమిళనాడు డీజీపీ రామానుజం పరస్పరం చర్చించుకుంటూ భద్రతా ఏర్పాట్లను ప్రారంభించారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు దారితీసే అన్ని రహదారుల్లో అదనపు చెక్‌పోస్టులు, స్పీడ్ కంట్రోలర్లు వేయడం పూర్తిచేశారు. గురువారం నుంచే అన్ని వాహనాలను తనిఖీలు చేయడం ప్రారంభించారు. తీర్పు వెలువడే రోజున తమిళనాడు నుంచి కనీసం 20 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేశారు. వీరి వల్ల బెంగళూరులో శాంతిభద్రత సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన రెండు రాష్ట్రాల పోలీసుల్లో నెలకొంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ఒకసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటిగా పిలుచుకునే అగ్రహారం సమీపంలో తాత్కాలిక న్యాయస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణంలో న్యాయవాదులు మినహా మరెవరూ ప్రవేశించకుండా చూడాలని నిర్ణయించారు. జయపై వెలువడుతున్న తీర్పు నేపధ్యంలో రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.
మంత్రి పూజలు
ఇదిలా ఉండగా, ఆస్తుల కేసు నుంచి అమ్మ క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తూ రాష్ట్ర మంత్రి రమణ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. తిరువళ్లూరు సమీపం పుట్లూరులోని ప్రసిద్ధ అంకాళపరమేశ్వరీ ఆలయంలో పూజలు నిర్వహించి వెయ్యిమందికి అన్నదానం చేశారు.