చుక్కెదురు
Published Fri, Apr 4 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అభియోగంతో 1996లో ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళపై అవినీతి నిరోధకశాఖ కేసు పెట్టింది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు 914 పట్టుచీరలు, 6,200 ఇతర చీరలు, దుస్తులు, రూ.88 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చిరుతావూరులో ఒక స్థల యజమానిని బెదిరించి 1.5 ఎకరాల భూమిని రాయించుకున్నట్లు అభియోగం మోపారు. జయలలిత అభ్యర్థన మేరకు కేసును బెంగళూరు ప్రత్యేక కోర్టుకు తరలించారు. అడపాదడపా బెంగళూరు కోర్టుకు జయలలిత హాజరవుతున్నా అధిక శాతం ప్రభుత్వం తరపు న్యాయవాదులే విచారణకు వెళుతున్నారు. బెంగళూరు ప్రత్యేక కోర్టులో ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. ఈ కేసులోని నిందితులు జయలలిత, శశికళ ఈ నెల 5వ తేదీన స్వయంగా విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి జాన్‌మైకేల్ డి గుణ ఆదేశించారు. జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తుండగా విచారణకు స్వయంగా హాజరుకావాలని బెంగళూరు కోర్టు ఆదేశించడం ఆమెకు ఆశనిపాతమే.
చెన్నైలోనూ చుక్కెదురు
జయలలిత, శశికళ భాగస్తులుగా నడుపుతున్న శశి ఎంటర్‌ప్రైజెస్ 1991-94 మధ్య కాలంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో వారిపై ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసు చెన్నై ఎగ్మూరులోని కోర్టులో 15 ఏళ్లుగా విచారణ సాగుతోంది. ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించాల్సిందిగా జయ, శశికళ వేసిన పిటిషన్‌ను ఎగ్మూరు కోర్టు కొట్టివేసింది. వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడా కేసు కొట్టివేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు సైతం కింది కోర్టుల నిర్ణయాన్ని సమర్ధించడమేకాకుండా నాలుగు నెలల్లోగా కేసును పూర్తిచేయాలని ఎగ్మూరు కోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు నాలుగు నెలల్లో కేసు ముగింపు పలకాల్సి ఉన్నందున 313 సెక్షన్ ప్రకారం నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని, ప్రశ్న, జవాబులకు అనుమతించాలని ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి గత నెల 20వ తేదీన కోర్టుకు విన్నవించారు.
సుప్రీంకోర్టులో తమ పిటిషన్ విచారణ దశలో ఉన్నందున కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేయాల్సిందిగా జయ తరపు న్యాయవాది కోరగా ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి ఆర్ దక్షిణామూర్తి నిరాకరించారు. నాలుగు నెలల్లో విచారణ ముగించాలన్న సుప్రీం ఆదేశాలకు కట్టుబడి వాయిదా వేయలేమని, ఏప్రిల్ 3వ తేదీనాటి వాయిదాకు జయలలిత, శశికళ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు వచ్చింది. జయలలిత, శశికళ హాజరుకాలేదు. ఇందుకు ఆగ్రహించిన ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి వాయిదాలపై వాయిదాలతో కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కేసును కొట్టేయాలన్న నిందితుల అభ్యర్థనను నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు తన ఆస్తుల కేసులను ప్రస్తావించకుండా ఆదేశించాలని సీఎం జయలలిత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రతిపక్షాలు ప్రస్తావించని దశలో సరిగ్గా ఎన్నికల ప్రచార వేళ కోర్టులే ఈ అంశాన్ని తెరపైకి తేవడం కాకతాళీయమైనా జయలలితకు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు.
Advertisement