‘హై-క’ అభివృద్ధే లక్ష్యంగా నేడు గుల్బర్గాలో అసెంబ్లీ
బెంగళూరు : హైదరాబాద్-కర్ణాటక ప్రాంత సమగ్ర అభివృద్ధే ముఖ్య అజెండాగా శుక్రవారం గుల్బర్గాలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతమైన హై-క అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుల్బర్గాలోని కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక హై-క ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇక్కడ సాగు, తాగునీటి వనరుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు అందజేయాల్సిన సాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. హై-క ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను 371(జె) ప్రకారం ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి రాకపోవడంతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే.
ఇక హై-క అభివృద్ధి మండలికి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పాటు ఇప్పటికే విడుదలైన నిధులను సైతం సరిగ్గా వినియోగించలేదు. ఈ కారణంగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక మంత్రి వర్గ సమావేశ నిర్వహణ కోసం గుల్బర్గాకు వస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులకు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గుల్బర్గా నగరాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జెండా లు, కాంగ్రెస్ నాయకుల కటౌట్‌లతో కాంగ్రెస్ శ్రేణులు నింపేశాయి. కాగా చెరుకు మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు ఈ మంత్రి వర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుల్బర్గాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఇందుకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించి గుల్బర్గాలో మోహరించారు.