పొత్తుల కోసం ఎత్తులు | Congress, BJP in a race to woo JD(S) | Sakshi
Sakshi News home page

పొత్తుల కోసం ఎత్తులు

Published Thu, Feb 25 2016 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పొత్తుల కోసం ఎత్తులు - Sakshi

పొత్తుల కోసం ఎత్తులు

 = జెడ్పీ అధ్యక్ష స్థానాల కైవసానికి
 వ్యూహ ప్రతివ్యూహాలు
 = స్థానిక పరిస్థితులకు అనుగుణంగా
 జేడీఎస్‌తో దోస్తీకి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు
 = కింగ్ మేకర్‌గా మారనున్న జేడీఎస్
 
 సాక్షి,బెంగళూరు: ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్రంలో గ్రామీణ రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్‌తోపాటు భారతీయ జనతా పార్టీలు మెజారిటీ జిల్లా పంచాయతీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహ,ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ జేడీఎస్ వైపు చూస్తున్నాయి. దీంతో తక్కువ స్థానాల్లో గెలిచినా కూడా జెడ్పీ అధ్యక్షస్థానాల ఎంపికలో జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారనుంది. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ 10 జిల్లాల్లో, విపక్ష బీజేపీ 7 జేడీఎస్ 2 జిల్లాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి స్వంత బలంతో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి.
 
 బాగల్‌కోటే, బెంగళూరు నగర, బెళగావి, విజయపుర, ధార్వాడ, కోలార, మైసూరు, రాయచూరు, శివమొగ్గ, తుమకూరు, యాదగిరి జిల్లాల్లో ఆ రెండు పార్టీలకు పొత్తులు అవసరమవుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలు మరిచి అటు కాంగ్రెస్‌తో పాటు, బీజేపీలు రెండూ దళంతో దోస్తీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. సాధారణంగా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఆయా జిల్లాలోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే పొత్తులు విజయమంతమవుతాయి.
 
 గత అనుభవాల దృష్ట్యా ఒక జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి జేడీఎస్ అంగీకారం తెలిపితే, మరొకొన్ని చోట్ల అదే జేడీఎస్ నాయకులు  కమలం నాయకులతో పొత్తు పెట్టుకోవడానికి సమ్మతించవచ్చు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీబీఎంపీ తరహాలో జేడీఎస్ అన్ని చోట్లా కాంగ్రెస్ లేదా అన్ని బీజేపీతోనే కలిసి నడవాలని నిర్ణయించిన ఆశ్చర్య పోనక్కరలేదు. మొత్తంగా ఏ పార్టీ ఏ జిల్లాల్లో ఎవరితో పొత్తు పెట్టుకుని జెడ్పీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
 
 భారీ తాయిలాలు...
 నూతన చట్టం ప్రకారం జెడ్పీ అధ్యక్షుడికి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవికి ఉన్న అధికారులు దక్కనున్నాయి. అంతేకాకండా ఐదేళ్ల పాటు ఆ స్థానంలో కొనసాగవచ్చు. దీంతో ఆ స్థానం పై కన్నేసిన జెడ్పీ సభ్యులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ మిగిలిన సభ్యులకు అన్ని రకాల తాయిలాలు అందజేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో  విహార యాత్ర ప్యాకేజీలు మొదలుకొని ఇన్నోవ కార్ల వరకూ ఉండటం గమనార్హం. ఈ విషయంలో అందికంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నది మాత్రం హంగ్ అవసరమైన చోట్ల గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థుల్లో కొందరని తెలుస్తోంది.
 
 కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (10), చిక్కబళాపుర, రామనగర, హావేరి, చిత్రదుర్గా, బెంగళూరు రూరల్, చామరాజనగర, ఉత్తర కన్నడ, కొప్పల్, గదగ్, బీహార్
 బీజేపీ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (7)
 ఉడిపి, కొడగు, దావణగెరె, దక్షిణకన్నడ, చిక్కమగళూరు, బళ్లారి, కలబుర్గీ
 జేడీఎస్ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (2)
 హాసన్, మండ్యా
 హాంగ్ అవసరమైన జిల్లాలు (11)
 బాగల్‌కోటే, బెంగళూరు నగర, బెళగావి, విజయపుర, ధార్వాడ, కోలార, మైసూరు, రాయచూరు, శివమొగ్గా, తుమకూరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement