మద్దతివ్వండి...
- బీబీఎంపీ మేయర్ ఎంపికపై ప్రధాన పార్టీల వైనం
- జేడీఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
- కార్పొరేటర్లను కాపాడుకునేందుకు దళ్ నేతల ప్రయత్నం
- దళపతిని కలిసిన సదానంద
- కుమారతో ఆర్.అశోక్, మంత్రులు భేటీ
సాక్షి, బెంగళూరు : మేయర్ పదవిని దక్కించుకోవడానికి జేడీఎస్ చుట్టూ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రదక్షిణం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా ఇరు పార్టీల నాయకులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో పాటు ఆ పార్టీలోని పలువురు నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదిలా ఉండగా జేడీఎస్ నాయకులు తమ కార్పొరేటర్లు చేజారి పోకుండా రహస్య స్థావరాలకు విమానాల్లో తరలించారు. ఈ పరిణామాలతో మేయర్ ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుతూహలం కలుగజేస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 100 వార్డులు గెలుచుకున్నా ఆ పదవిని చేపట్టడానికి ఆ పార్టీకు ఇంకా రెండు మూడు సీట్లు తక్కువ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆ పదవిని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నగర ఇన్‌ఛార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బెంగళూరుకే చెందిన దినేష్‌గుండూరావ్ ప్రతి క్షణం జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామితో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో మేలుకున్న బీజేపీ నాయకులు జేడీఎస్ పార్టీ అధినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ నేరుగా జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడను నగరంలోని పద్మనాభనగర్‌లోని ఆయన ఇంట్లో రెండుసార్లు భేటీ అయ్యారు. మేయర్ పదవిని చేపట్టడానికి సహకారం అందించాలని కోరారు.
ఇదిలా ఉండగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ చిక్కమగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామితో శనివారం ఉదయం భేటీ అయ్యారు. మేయర్, ఉపమేయర్‌పదవి ఎంపికలో తమకు సహకారం అందించాల్సిందిగా కోరారు. అయితే జేడీఎస్ అధినాయకుల నుంచి బీజేపీ నాయకులకు ఎటువంటి స్పష్టమైన హామి లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌ఖాన్ శనివారం సాయంత్రం తమ పార్టీ నుంచి ఎంపికైన 14 మంది కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన మరికొంతమంది జేడీఎస్ నాయకులతో కలిసి కేరళలోని కొచ్చి, అలెప్పిలకు వెళ్లిపోయారు. అయితే సెప్టెంబర్ 2న పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తానని దేవెగౌడ తనతో చెప్పినట్లు సదానందగౌడ శనివారం సాయంత్రం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో తెలియజేశారు. ఇదిలా ఉండగా తమ మద్దతు పొందడానికి ఒక్కొరికి రూ.10 కోట్లు ముట్టజెప్పడమే కాకుండా స్థానిక వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు విడుదల చేయాల్సిందిగా స్వతంత్ర అభ్యర్థులు డిమాం డ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.