ఆత్మరక్షణలో అధికార పక్షం
సాక్షి, బెంగళూరు: ఆర్కావతి విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. భారతీయ జనతా పార్టీతోపాటు మరో విపక్షమైన జేడీఎస్ ఆర్కావతి విషయంలో ఎలాగైనా సీఎం సిద్ధరామయ్యను ప్రజల ముందు దోషిగా చేయాలని కంకణం కట్టుకున్నాయి. ఈ పరిస్థితిలో ఆ రెండు పార్టీలను దీటుగా ఎదుర్కొనే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఓ పుస్తకాన్ని తీసుకురావడంతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా అందులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి కిందికి దించడమే లక్ష్యంగా బీజేపీ ఆర్కావతి డీ నోటిఫికేషన్ విషయాన్ని బయటకు లాగిన విషయం తెలిసిందే.
ఆరోపణల వెల్లువ
తాజాగా మరో మూడు చోట్ల సిద్ధు డీ నోటిఫైకు పాల్పడ్డారని శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ జగదీష్ శెట్టర్ బయటపెట్టారు. ఈ విషయమై చట్టసభల్లో బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని నిలదీశారు. మొదట్లో డీ నోటిఫై విషయంలో కాస్త మెతక వైఖరిని అవలంభించిన జేడీఎస్ తర్వాత బీజేపీ కంటే ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా ఆర్కావతి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఓ పుస్తకాన్నే బయటకు తీసుకువచ్చింది. ఈ పుస్తకంలో సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 544 ఎకరాల డీ నోటిఫై చేసినట్లు ఆధారాలతో సహా వివరించింది. తాజా పరిణామాలతో సిద్ధు తన సహచరులతో సమాలోచన జరిపారు. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా ఆర్కావతికి డీ నోటిఫైకు సంబంధించి మరో పుస్తకాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
పుస్తకంపై ఊహాగానాలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న పుస్తకంలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో ఆర్కావతి లే అవుట్‌కు సంబంధించి రీ-మోడిఫికేషన్ మాత్రమే చేసినట్టు నిరూపించనున్నారు. అంతేకాకుండా జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఆర్కావతికి సంబంధించి డీ నోటిఫై జరిగినట్లు కొన్ని ఆధారాలను పుస్తకంలో పొందుపరచనున్నట్టు సమాచారం. ఈ మేరకు రూపొందించిన పుస్తకంలోని ముఖ్యవిషయాలతో కూడిన కరపత్రాలను సభ్యత్య నమోదు కేంద్రాల ద్వారా ప్రజలకు పంచాలని భావిస్తోంది. మరోవైపు ఈ విషయాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార ఫేస్‌బుక్ పేజీ, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించారు. తద్వారా విపక్షాల ఆరోపణలను కొంత వరకూ ఎదుర్కొనవచ్చుననేది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ఇందుకు పార్టీ హైకమాండ్ అనుమతి లభించినట్లు సమాచారం.