పొత్తు కుదిరింది!
మాజీ మిత్రులైన కాంగ్రెస్, డీఎంకే మళ్లీ ఏకమయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదని మరోసారి నిరూపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నట్లు శనివారం చెన్నైలో ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్ర చట్టసభకు త్వరలో జరుగనున్న ఎన్నికలపై అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. డీఎంకేతో పొత్తు కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటీ పడ్డాయి. మరికొన్ని పార్టీలూ ఆచితూచి అడుగువేస్తూ డీఎంకేనా లేక అన్నాడీఎంకేనా అనే ఆలోచనలో పడ్డాయి. దీంతో పొత్తు రాజకీయాలన్నీ డీఎంకే చుట్టూ పరిభ్రమించడం ప్రారంభించాయి. ఈనెల 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కుమారుని వివాహానికి అదే పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా హాజరుకానున్నారు.
ఈ కల్యాణ వేడుకకు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి కూడా వస్తున్నారు. ఇదే అదనుగా అమిత్‌షా, కరుణ మధ్య రాజకీయ చర్చలు జరిపించాలని కమలనాథులు ఆశించారు. ఈ సమాచారం అందుకున్న కాంగ్రెస్ అధిష్టానం రెండు రోజులు ముందుగానే కరుణను కలిసేందుకు సిద్ధమైంది. అధిష్టానం దూతగా కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ శనివారం చెన్నై చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను వెంటపెట్టుకుని గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్, ఎంపీ కనిమొళి ఆజాద్‌కు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. ఆజాద్ సైతం కరుణానిధికి శాలువా కప్పారు. సుమారు అరగంటపాటు నేతలంతా చర్చలు జరిపారు.
కరుణానిధి నేతృత్వంలో ప్రభుత్వం ఖాయం - ఆజాద్
అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్, డీఎంకేలు కలసి పోటీచేయనున్నట్లు గులాంనబీ అజాద్ ప్రకటించారు. కరుణానిధి ఇంటి నుంచి బైటకు రాగానే ఆజాద్ మీడియా మాట్లాడుతూ, రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాం, గెలుపు కోసం కలసి పోరాడుదాం అని చెప్పారు. ఈ కూటమిలో ఇంకా మరే పార్టీలు చేరుతాయనే ప్రశ్నకు అవన్నీ కరుణానిధి చూసుకుంటారని బదులిచ్చారు. తమ చర్చల్లో సీట్ల పంపకాల ప్రస్తావన రాలేదనిపొత్తు కుదిరింది!
తెలిపారు. ఆ తరువాత మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, కాంగ్రెస్, డీఎంకేల కూటమిని ఖరారు చేస్తూనే కరుణానిధి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆజాద్ ఆకాంక్షించారని తెలిపారు. కూటమిలో చేరాల్సిందిగా డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్‌కు ఇప్పటికే ఆహ్వానం పలికామని చెప్పారు.
రాజకీయాల్లో గతం గతః
‘ఎప్పటికయ్యది ప్రస్తుతమో అప్పటికయ్యది...’ అనే నీతి సూత్రాన్ని కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తూచా తప్పకుండా పాటించాయి. గత రెండు టర్మ్‌ల యూపీఏ ప్రభుత్వాల్లో డీఎంకే భాగస్వామిగా ఉండి కేంద్రంలో కేబినెట్ పదవులను అనుభవించింది. డీఎంకే కోటాలో కేబినెట్ మంత్రులైన ఏ రాజా, దయానిధి మారన్ భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిద్దరిపై చార్జీషీటును దాఖలు చేసిన సీబీఐ అధికారులు ఎంపీ కనిమొళి, కరుణానిధి సతీమణి దయాళూఅమ్మాళ్‌లను సైతం అందులో చేర్చారు.
తమ భాగస్వామ్యంతో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదని కరుణ కోపగించుకున్నారు. ముందుగా మంత్రి వర్గం నుండి వైదొలిగి ఆ తరువాత అంటే 2014లో యూపీఏతో పొత్తుకే కరుణ కటీఫ్ చెప్పేశారు. అయితే పైకి ఈ విషయాలను చెప్పకుండా శ్రీలంక తమిళుల, రాష్ట్రంలోని జాలర్ల సమస్యలపై కేంద్రప్రభుత్వం వైఖరి నచ్చకనే కూటమి నుండి వైదొలుగుతున్నట్లు కరుణానిధి సమర్థించుకున్నారు. ఆ తరువాత వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో కనిమొళిని గెలిపించుకున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు కోసం కాంగ్రెస్ తహ తహలాడినా ససేమిరా అన్నారు. గత్యంతరం లేని కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయానికి పాత మిత్రులు మళ్లీ ఏకమయ్యారు. కరుణానిధి ముఖ్యమంత్రిని చేయడమే కాంగ్రెస్ ధ్యేయమని ఆజాద్ చెప్పారు. ఈ పరిణామంతో విస్తుపోయిన మీడియా ఆజాద్‌ను ఒక ప్రశ్న వేసింది. రెండేళ్ల క్రితం విడిపోయారు, నేడు మళ్లీ ఏకమయ్యారు, రెండు పార్టీల మధ్య స్నేహంపెరిగేలా ఈ మధ్య కాలంలో ఏమి జరిగిందని ఆజాద్‌ను నిలదీశారు. ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ఆజాద్ నిష్ర్కమించారు.