
‘సిద్ధు’పై హైకమాండ్ గరం...
కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ను
ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం
రాష్ట్ర పరిణామాలపై సోనియా ఆరా
బెంగళూరు: లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ వాచ్ వ్యవహారంతో ప్రతిపక్షాల విమర్శలకు గురైన సిద్ధరామయ్య ఆ తర్వాత ఏకపక్షంగా ఏసీబీ ఏర్పాటు చేసి అటు విపక్షాలు, వివిధ సంస్థలతో పాటు స్వపక్షంలోని నేతల నుంచిసైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఏకపక్షంగా ఏసీబీ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం సీఎం సిద్దరామయ్యను వివరణ కోరింది.
ఇక కరువు నిర్వహణలో సైతం సిద్ధరామయ్య విఫలమయ్యారంటూ స్వయానా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడిన విషయమూ తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ఏదో ఒక విషయంపై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సీఎం సిద్ధరామయ్య ఇప్పుడేమో పుత్రవ్యామోహంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం రాష్ట్రంలో మరో వివాదాన్ని రేకెత్తించింది.
కేవలం ల్యాబ్‌ల ఏర్పాటు విషయమే కాదు తన కుమారుడి స్నేహితుడికి నిబంధనలకు విరుద్ధంగా బీడీఏ స్థలాన్ని కేటాయించడం ద్వారా రూ.150 కోట్ల అక్రమాలకు తెరతీశారని వచ్చిన ఆరోపణలు సిద్ధరామయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు సిద్ధరామయ్యపై ఉన్న అసహనాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా వివరాలు తెలుసుకున్నారు.
పరమేశ్వర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు......
రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బి.ఎస్.యడ్యూరప్ప బాధ్యతలను చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో సీఎం సిద్ధరామయ్యపై తలెత్తుతున్న వివాదాలు బీజేపీకి అనుకూలిస్తాయని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన పరమేశ్వర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై దాదాపు అరగంట పాటు చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కేటాయించడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఏమీ లేదని ఆయన సోనియాగాంధీకి వివరించినట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతోనే ప్రతిపక్షాలు ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారని అధినేత్రికి వివరించారు.
అయితే సోనియాగాంధీ మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదని సమాచారం. సిద్ధరామయ్యపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీని సైతం చిక్కుల్లోకి నెట్టేస్తాయని సోనియాగాంధీ భావిస్తున్నారు. మే 13 నాటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటిని వివరిస్తూ ఆయన్ను పదవి నుంచి తప్పించే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.