కాంగ్రెస్‌కు మరో నాయకుడి షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అర్వీందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో లవ్లీ ప్రముఖ నాయకుడు. షీలా దీక్షిత్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. లవ్లీ బీజేపీలో చేరడం దురదృష్టకరమని షీలా అన్నారు. పార్టీలో పదవులు అనుభవించి వెళ్లే నాయకులను ఎవరు నమ్ముతారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌కు నాయకులతో సఖ్యతగా ఉంటూ వారిని కాపాడుకోవడం సాధ్యం కావడం లేదని, అందుకే పార్టీని వీడుతున్నారని షీలా అన్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో లవ్లీ అసంతృప్తి చెందారని సమాచారం.
ఎంసీడీ టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని ఇటీవల ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్‌దేవా ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే వాలియా కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.