బీజేపీకి ఆహ్వానం అప్రజాస్వామికం!
న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి లెఫ్ట్ నెంట్ గవర్నర్ రాజ్ నివాస్ బీజేపీకి ఆహ్వానం పంపడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టడానికి రంగం సిద్దం చేసింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేది అప్రజాస్వామికం అని స్థానిక కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చావో-రేవో తేల్చుకుంటామని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆదివారం భారీ స్థాయిలో ఆందోళన చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. తాము చేపట్టబోయే ర్యాలీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ముఖల్ వాస్నిక్, డీపీసీసీ అధ్యక్షుడు సింగ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి హరూన్ యూసఫ్ లు పాల్గొనున్నారు.
అంతకుముందు శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈమేరకు వినతి పత్రం అందజేశారు. 'ఇది పార్టీ ఫిరాయింపులు, బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని బహిరంగంగా ఆహ్వానించడమే’ అని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కాగా, రహస్య బ్యాలెట్ ద్వారా సీఎంను ఎన్నుకోవచ్చన్న బీజేపీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అది రాజ్యాంగానికి విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు చెప్పారన్నారు.
ఫిబ్రవరిలో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం తెలిసిందే. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం బేరసారాలకు దిగబోమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో తమదే పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని, దీనికి మద్దతు కోసం ప్రయత్నించడం అనైతికం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలున్నారు.