‘దీక్షా దివస్ కాదు.. సోనియా కృతజ్ఞతా దివస్’
హైదరాబాద్: కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సవాలు చేసుకోవటం సరికాదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆరు దశాబ్దాల ఉద్యమాన్ని.. సకల జనుల మనసెరిగి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన చెప్పారు. అందుకే దీక్షా దివస్ బదులు.. సోనియా కృతజ్ఞతా దివస్ నిర్వహించి, ఢిల్లీలో సోనియాను కలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అప్పట్లో అన్న కేసీఆర్.. ఇప్పుడేమో కాంగ్రెస్‌పై బురదజల్లుతున్నారని విమర్శించారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వ నిర్ణయాలకు.. ఉద్యమ నేతగా చెప్పుకునే కేసీఆర్ గుడ్డిగా మద్దతు ఇవ్వటం దారుణమని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై కేబినెట్‌లో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్, సామాన్యుల ఇబ్బందులు పట్టనట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి డబ్బులు వెళుతున్నా.. తెలంగాణకు లిక్విడ్ మనీ తీసుకురావాలన్న ఆలోచన కూడా కేసీఆర్‌కు లేదని విమర్శించారు. నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజలకు ఎంతమేర అవగాహన ఉందని ప్రశ్నించారు. ఈ అంశంపై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.