కొత్త జిల్లాల పేరుతో సీఎం కేసీఆర్ పూటకో మాట చెబుతున్నారని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ మండిపడ్డారు.
- జిల్లాల పునర్విభజనలో సీఎం తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ ఎంపీ వీహెచ్
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన పేరుతో పూటకో పేరు వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆ ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. రాత్రికి ఏం ఆలోచన వస్తే పొద్దున ప్రకటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలనీ, వాస్తు, అదృష్టసంఖ్య ప్రకారం కాదని వీహెచ్ అన్నారు. ప్రతిపక్షాల నేతలు రాజకీయంగా ఎదగకుండా చే యాలనే దురుద్దేశంతో గజిబిజిగా చేస్తున్నారన్నారు. కేసీఆర్ పరిపాలన అచ్చం నిజాంను తలపిస్తోందన్నారు. బంగారు తెలంగాణను కాస్త అప్పుల తెలంగాణగా మార్చాడని, ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రైతు రుణమాఫి, డబుల్‌బెడ్‌రూం, ఫీజురీయింబర్స్‌మెంట్ తదితర సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, వాటి నుంచి దృష్టి మళ్లించడానికే జిల్లాల కుంపటి పెట్టారని వీహెచ్ మండిపడ్డారు.