- తుది కసరత్తులో పార్టీలు
- అభ్యర్థుల ఎంపికపై పూర్తి దృష్టి
- నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం
- రేపు బీజేపీ తొలి జాబితా
- 21 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
- 15 నాటికి తుది జాబితా?
- 15 మందితో జేడీఎస్ జాబితా 15న
- 19న తుది జాబితా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు హాజరవుతారు.
మొత్తం 28 నియోజక వర్గాలకు అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తు తం తొమ్మిది మంది ఎంపీలలో ధరం సింగ్ (బీదర్) మినహా మిలిగిన వారందరికీ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. బెంగళూరు దక్షిణ నియోజక వర్గానికి ‘ఆధార్’ చైర్మన్ నందన్ నిలేకని పేరు ఖరారైనా, ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన పార్టీలో లాంఛనంగా చేరనున్నారు.
8న బీజేపీ తొలి జాబితా
బీజేపీ ఇప్పటికే 21 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం ఢిల్లీలో జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం తొలి జాబితా విడుదల కానుంది. మొత్తం 28 స్థానాలకు అభ్యర్థులను సూచిస్తూ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ అధిష్టానానికి జాబితా పంపింది. బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనమయ్యే విషయమై కొంత జాప్యం జరిగినందున కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడింది. విలీనానికి శ్రీరాములు సమ్మతించడంతో తుది జాబితాకు మార్గం సుగమమైంది. ఈ నెల 15 నాటికి తుది జాబితా వెలువడే అవకాశాలున్నాయి.
15న జేడీఎస్ జాబితా
అభ్యర్థుల ఎంపికపై జేడీఎస్ ప్రాథమిక కసరత్తును పూర్తి చేసింది. ఈ నెల 15 నాటికి 15 మందితో తొలి జాబితాను విడుదల చేయనుంది. 19న తుది జాబితా వెలువడనుంది. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడ వేచి చూసే ఎత్తుగడను అవలంబించడం సహజం. కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు లభించని ప్రధాన నాయకులను అక్కున చేర్చుకుని పార్టీ అభ్యర్థిత్వం ఇవ్వడం ఆయన నైజం. కాగా నగరంలోని ప్యాలెస్ మైదానంలో ఈ నెలాఖరులో తృతీయ ఫ్రంట్ సమావేశాన్ని నిర్వహించాలని జేడీఎస్ నిర్ణయించింది. ఫ్రంటులోని మొత్తం 11 పార్టీల నాయకులను సమావేశానికి ఆహ్వానించి బల ప్రదర్శన నిర్వహించడానికి సమాయత్తమవుతోంది.