ఒకే సారి రెండు చోట్ల దొరికిన బాంబులు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. కన్యాకుమారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంటి వద్ద 11 బాంబులు దొరికాయి. అలాగే మదురై జిల్లా మేలూరులో పేలుడు పదార్థాలను దాచి ఉంచిన ఇద్దరు అరెస్టయ్యారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : కన్యాకుమారి జిల్లా కులచ్చల్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సబీన్ (33) ఇంటికి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఇద్దరు బైక్‌పై వచ్చి ఇంటి తలుపు తట్టారు. వారిని అనుమానించిన ఇరుగుపొరుగువారు మీరెవరని ప్రశ్నించగా చేపలు తెచ్చినట్లు బదులిచ్చారు. చేపలను ఇంటిముం దు పెట్టి వెళ్లండి వారు నిద్రలేచిన తరువాత తీసుకుంటారని స్థానికులు చెప్పడంతో వారి వెంట తెచ్చిన బకెట్‌ను అక్కడ పెట్టి వెళ్లిపోయారు. వారి కదలికలను అనుమానించిన స్థానికులు బకెట్‌ను తనిఖీ చేయగా అందులో 11 బాంబులను గుర్తించి భయభ్రాంతులకు గురయ్యారు.
పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లా ఎస్పీ మణివణ్ణన్ కులచ్చల్‌కు చేరుకుని కాంగ్రెస్ నేత సబీన్ తదితరులను విచారించారు. కొట్టిల్‌పాట్టికి చెందిన జేరోమ్, కులచ్చల్‌కు చెందిన డయానీని అరెస్ట్ చేశారు. జేరోమ్‌పై వరకట్న వేధింపుల కేసు కొనసాగుతుండగా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కోర్టు అతనిపై పీటీ వారెంట్ జారీ చేసింది. తనపై కేసు బనాయించడంలో కాంగ్రెస్ అధ్యక్షులు సబీన్ ప్రోద్బలం ఉండొచ్చని అనుమానించి హతమార్చేందుకు కుట్రపన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పేలుడు పదార్థాలు స్వాధీనం-ఇద్దరు అరెస్ట్
శివగంగై జిల్లా ప్రాన్‌మలైలో సందేహాస్పదంగా కొందరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చెన్నై నుంచి ప్రత్యేక ఇంటెలిజన్స్ పోలీసు సూపరింటెండెంట్ శంకర్ బృందం మదురై సమీపంలోని మేలూరుకు చేరుకుంది. మేలూరులోని ముగమతియార్ పురానికి చెందిన మీరాన్ మైదీన్ కుమారుడు ముబారక్ (19), అబ్బాస్ (40)ను అదుపులోకి తీసుకుని రహస్య విచారణ జరిపారు. మదురైలో పేలుడు పదార్థాలను దాచి వుంచిన కేసులో ఇటీవల అరెస్టయిన సమ్సుద్దీన్‌తో సంబంధాలు ఉన్నట్లు వారు అంగీకరించారు. వీరిద్దరినీ ప్రాన్‌మలైకు తీసుకెళ్లగా 1500 ఏళ్ల నాటి శివుని ఆలయం, సమీపంలోని దర్గాకు మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో పేలుడు పదార్థాలు కనుగొన్నారు. పేలుడుకు ఉపయోగించే టైమర్, ముడి పదార్థాలు, స్పానర్, రంపం, ప్లాస్టిక్ కుళాయి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బాంబుల కలకలం
Published Mon, Mar 23 2015 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement