నవీముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం( ఎన్‌ఎంఐఎ) నిర్మాణానికి మార్గం సుగమమైంది.
సాక్షి, ముంబై: నవీముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం( ఎన్‌ఎంఐఎ) నిర్మాణానికి మార్గం సుగమమైంది. విమానాశ్రయం పనులు చేపట్టే సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదాయం వాటాను పెంచి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీతో కొన్నేళ్లుగా పెండింగులో పడిపోయిన ఈ విమానాశ్రయానికి మోక్షం లభించినట్లయింది. దీంతో నిర్మాణ పనులకు అహ్వానించిన టెండర్లకు 2015 జనవరి 28 వరకు గడువు పెంచుతున్నట్లు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరే షన్ (సీడ్కో) ప్రకటించింది. ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయం నిర్మించేందుకు సుమారు రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా వేశారు.
అందుకు 2014 ఫిబ్రవరి ఐదో తేదీన సర్కూలర్ జారీచేసి టెండర్లను ఆహ్వానించారు. కాని వ్యయం, వచ్చే ఆదాయం మధ్య చాలా వ్యత్యాసముండటంతో ఈ విమానాశ్రయం పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు. రెండు, మూడు పర్యాయాలు గడువు పెంచినప్పటికీ కాంట్రాక్టర్లు ఆసక్తి కనబర్చ లేదు. దీంతో ఈ విమానాశ్రయ భవిత అగమ్యగోచరంగా మారింది. అనేక ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు సిడ్కో కూడా అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ అవి ఫలించలేదు. చివరకు ఇటీవల సీఎం ఫడ్నవిస్ చొరవ తీసుకుని పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు.
విమానాశ్రయం లోపల, పరిసరాల్లో వాణిజ్య, వ్యాపార సంస్థల ద్వారా వచ్చే అద్దె, విమానాలు ల్యాండింగ్, టేకప్ ద్వారా లభించే ఆదాయం, వాహనాల పార్కింగ్, ఇతర మాద్యమాల ద్వారా వచ్చే వనరుల్లో కొంత వాటా విమానాశ్రయం నిర్మించే కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. ఇదివరకే ఈ విమానాశ్రయ స్థల సేకరణ వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, ఇతర సౌకర్యాలపై వివాదం మరింత ముదిరి పెండింగులో పడిపోయింది. వీటన్నింటిని విడతల వారీగా పరిష్కరించి ఓ కొలిక్కి తెచ్చారు. కాని అందుకు అవుతున్న భారీ వ్యయం, వచ్చే ఆదాయంపై కాంట్రాక్టర్లు బేరీజు వేసుకుని ముందుకు రావడం లేదు. చివరకు అది కూడా పరిష్కారం కావడంతో ఇక అడ్డంకులన్ని తొలగిపోయినట్లేనని సీడ్కో భావిస్తోంది.