కేశవరావుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి.
• మూడో రోజూ హైపవర్ కమిటీతో పలువురు నేతల భేటీ
• గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల
• ప్రతిపాదనలే పరిశీలించాం: కేకే
• ముగిసిన కమిటీ గడువు...నేడు సీఎంకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘‘అనవసర అపోహలు వద్దు. కేవలం గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ నాలుగు జిల్లాల ప్రతిపాదలను పరిశీలించడం వరకే మేము పరిమితం. మండలాలపై వినతులు తీసుకున్నాం. కొత్త జిల్లాలు కావాలని వస్తున్నారు. వాటిని వినడమే కానీ చేసేదేమీ లేదు. మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనా చేయడం లేదు. కమిటీ గడువు గురువారంతో ముగిసింది. నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తాం ’’ అని కొత్త జిల్లాలపై ఏర్పాటైన హైపవర్ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (కేకే) తెలిపారు. మూడో రోజైన గురువారం కూడా కొత్త జిల్లాల కోసం హైపవర్ కమిటీకి వినతులు అందాయి.
కేవలం నాలుగు జిల్లాలనే కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారని తెలిసినా ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి, సమ్మక్క-సారలమ్మ (ములుగు), పీవీ (హుజూరాబాద్) జిల్లాలు కావాలని విజ్ఞప్తులు అందాయి. ఖమ్మం పరిధిలోని సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వినతి పత్రం అందజేయగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ నియోజకవర్గాలను కలిపి ఇబ్రహీంపట్నం చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. మరోవైపు మంత్రి చందూలాల్ కూడా కమిటీని కలిశారు.
గతంలో ములుగు ప్రాంతాన్ని సమ్మక్క -సారలమ్మ జిల్లా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచే శారు. మలుగును జిల్లా చేయాలని కమిటీని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విన్నవించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలిపి 14 మండలాలతో కొత్తగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు హైపవర్ కమిటీని కోరారు. అనంతరం వారు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమవగా వారికి మద్దతుగా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బి.వినోద్ ఈ భేటీకి హాజరయ్యారు. పీవీ జిల్లా ఏర్పాటు విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
ఒకవైపు గద్వాల జిల్లాకు జోగులాంబ పేరు పెడతామని చెబుతూ.. జోగులాంబ ఉన్న ఆలంపూర్‌ను వనపర్తిలో కలపడం ఏమిటని కమిటీని కలిసిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరసన తెలిపారు. ఆలంపూర్, ఉండవెల్లిని వనపర్తిలో కలపొద్దని కమిటీకి విన్నవించారు. కాగా, మూడు రోజుల్లో హైపవర్ కమిటీకి ప్రధానంగా దేవరకొండ, మిర్యాలగూడెం, ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం/ములుగు, సమ్మక్క- సారలమ్మ, ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి జిల్లాలు కావాలంటూ విజ్ఞప్తులు అందాయి. గడువు ముగియడంతో కమిటీ తన నివేదికను గురువారం రాత్రి లేదా శుక్రవారం సీఎం కేసీఆర్‌కు సమర్పించనుంది.
జ్యుడీషియల్ కమిటీ వేయాలి: పొన్నాల
జనగామను జిల్లా చేయాలని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కమిటీని కలసి వినతిపత్రం ఇచ్చారు. జిల్లాల ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జ్యుడీషియల్ కమిటీని నియమించాలని కోరారు. ఒకవిధంగా సర్కారు ఏకపక్షంగానే జిల్లాలను విభజిస్తోందని ఆరోపించారు. చివరి నోటిఫికేషన్‌లో జనగామ కొత్త జిల్లాగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మీడియాకు వివరించారు.