పాలికె ఎలుక లెక్కలు
- ఒక్కో ఎలుకను పట్టుకోడానికి రూ. 10 వేల ఖర్చు చూపిన బీబీఎంపీ
- లెక్కలు తోడేశారు
- ఖర్చు మొత్తం రూ. 1.98 లక్షలట !
- పాలికె సమావేశంలో నీళ్లు నమిలిన అధికారులు
బెంగళూరు : కాకి లెక్కలు విన్నాము కానీ ఈ ఎలుక లెక్కలు ఏమిటీ అని తెలుసుకోవాలనుందా..! అయితే బెంగళూరు బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఒక్కొ ఎలుకను పట్టుకోడానికి రూ. 10 వేలు ఖర్చు చేసినట్లు చూపించి లెక్కలు తోడేశారు. పాలికె సిబ్బంది. 20 ఎలుకలు పట్టడానికి రూ. 1.98 లక్షలు ఖర్చు చూపి ఘనమైన రికార్డు మూటగట్టుకున్నారు.
వివరాలు... పాలికె కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన రికార్డులను భద్రపరచడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఎలుకలు దూరి రికార్డులను తినేస్తుండటంతో సిబ్బంది ఆరు నెలలుగా 20 ఎలుకలను పట్టుకుని ఖర్చు రూ. 1.98 లక్షలు అయ్యిందని లెక్కలు తవ్వుకున్నారు.
మండిపడిన అధికార పార్టీ నాయకుడు .. నీళ్లు నమిలిన అధికారులు
బుధవారం బీబీఎంపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీ కార్పొరేటర్ (బీజేపీ) ఎన్.ఆర్. రమేష్ మాట్లాడుతూ... పాలికె అధికారులు ఏమి తలచుకుంటే అది చేసేస్తారు. తిమ్మినిబొమ్మిని కూడా చేస్తారు. ఒక్క ఎలుకను చంపడానికి రూ. 10 వేలు ఖర్చు పెట్టిన ఘన చరిత్ర, ప్రపంచలో ఎవ్వరికి దక్కని అరుదైన రికార్డు సొంత చేసుకున్నారు అంటూ మండిపడ్డారు.
వీరిని గిన్నిస్ రికార్డులో ఎక్కించాలని వ్యంగ్యంగా అన్నారు. రూ. 12 ఇస్తే ఎలుకల మందు ప్యాకెట్ ఇస్తారు. అయితే సిబ్బంది మాత్రం 20 ఎలుకలు పట్టడానికి రూ. 1.98 లక్షలు ఖర్చు చేశామని నిస్సిగ్గుగా లెక్కలు రాయడం బాధ్యతలేనితనానికి నిదర్శనమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ఏమీ చెప్పలేకుండా మిన్నకుండిపోయారు. ప్రతిపక్షాలు సైతం అధికారుల వైఖరిని నిలదీశాయి. ఏదీ ఏమైనా ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతోందో ఈ సంఘటనే ఒక ఉదాహరణ.