
విచారణకు రావాల్సిందే!
దినకరన్‌కు కోర్టు ఆదేశం
చెన్నై : విదేశీ మారక ద్రవ్య కేసు విచారణ నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఏర్పడింది. ఎగ్మూర్ కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా. ఈనెల 19,20 తేదీల్లో కోర్టుమెట్లు ఎక్కాల్సిందేనని గురువారం ఆదేశాలు జారీ చేసింది. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ విదేశీ మారక ద్రవ్య కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ఎగ్మూర్ కోర్టులో జరుగుతోంది. ఈ విచారణకు డుమ్మా కొట్టే విధంగా దినకరన్ వ్యవహరిస్తూ రావడంతో కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గురువారం పిటిషన్ విచారణకు రాగా, టీటీవీ , ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. టీటీవీ తరఫు న్యాయవాది ఈ పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కోరారు. హైకోర్టులో ఈ కేసుకు తగ్గ పిటిషన్ వేసి ఉన్నామని సూచించారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు సూచించ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అక్షింతలు వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం 19,20 తేదీల్లో కోర్టుకు టీటీవీ దినకరన్ హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
గడువు : కేసులన్నింట్నీ వాయిదాల మీద వాయిదాలతో నెట్టుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్న అన్నాడీఎంకే పెద్దలు, రెండాకుల చిహ్నం విషయంలోనూ అదే బాట అనుసరించే పనిలో పడ్డారు. రెండాకుల చిహ్నం విషయంగా వివరణ ఇవ్వాలని మాజీ సీఎం పన్నీరు శిబిరానికి, చిన్నమ్మ శశికళ నేతృత్వంలో టీటీవీ శిబిరానికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16లోపు వివరణ ఇవ్వాల్సి ఉండగా, తమకు ఎనిమిది వారాలు సమయం కావాలని చిన్నమ్మ శిబిరం తరఫున టీటీవీ ప్రతినిధులు ఢిల్లీలో సీఈసీకి విజ్ఞప్తి చేశారు.