‘బాబు అరాచక పాలన సాగిస్తున్నారు’
కాకినాడ: ఏపీలో చంద్రబాబు అరాచక పాలనను సాగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న తమని అరెస్ట్ చేసిన సందర్భంగా పిడిగుద్దులు గుద్దిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివీస్‌కు వ్యతిరేకంగా మళ్లీ ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15న సీపీఎం జాతీయ నేత రాఘవులు, 27న సీపీఎం ఎంపీల బృందం దివీస్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుందని తెలిపారు.
ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం కాలుష్య కారక పరిశ్రమలను తెచ్చి పెడుతుందని అన్నారు. టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు.. గత ఆరు నెలలుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న చంద్రబాబు దాన్ని పక్కదారి పట్టించడం కోసమే విశాఖలో ప్రేమికుల రోజు జరిగే బీచ్ ఫెస్టివల్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు.