► సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్
► రామ్మోహన్ రావుకు ఉద్వాసన
► సస్పెండ్... వీఆర్‌కు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా ఐఏఎస్ అధికారికి పట్టం కట్టారు.రెండేళ్ల అనంతరం ఓ మహిళా అధికారి ఆ పదవిని దక్కించుకున్నారు. గిరిజా వైద్యనాథన్ ను ఆ పదవికి ఎంపిక కావడంతో సహచర ఐఏఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐటీ ఉచ్చుకు చిక్కిన రామ్మోహన్ రావుకు ఉద్వాసన పలికారు. ఆయన్ను సస్పెండ్ చేసి వీఆర్‌కు పంపించారు.
సాక్షి, చెన్నై :2016లో తమిళనాడులో రాజకీయంగా అన్నీ సంచలనాలే. జయలలిత రాష్ట్ర చరిత్రను తిరగరాస్తూ రెండోసారిగా అధికార పగ్గాలు చేపట్టారు. అలాగే, ప్రప్రథమంగా బలమైన ప్రతి పక్షంగా డీఎంకే అవతరించింది. సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతూ వచ్చిన అమ్మ జయలలిత అందని దూరాలకు చేరడం పెను విషాదమే. ఆ అమ్మ లేని లోటును తీర్చేందుకు తగ్గట్టుగా అన్నాడీఎంకేలో విశ్వ ప్రయత్నాలే సాగుతున్నాయి. అమ్మ విధేయుడు, నమ్మిన బంటు పన్నీరు సెల్వం మళ్లీ సీఎం అయ్యారు. ఇక, వర్దా రూపంలో తుపాన్ తాండవం మరువక ముందే, తమిళనాడు చరిత్రలో బుధవారం మరో సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర చరిత్రలో ప్రధాన కార్యదర్శి హోదా అధికారి రామమోహన్ రావు ప్రపథమంగా ఐటీ ఉచ్చులో పడ్డారు.
నల్లధనాన్ని దాచి పెట్టిన అపఖ్యాతిని మూట గట్టుకోవడమే కాకుండా, ఆయన రూపంలో సచివాలయంకు మాయని మచ్చ పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌లో సైతం ఐటీ సోదాలు సాగిన రోజు. పాలకుల అవినీతిలో భాగస్తుడిగా అవతరించిన ఈ అధికారి రూపంలో నిజాయితీతో ముందుకు సాగే ఐఎఎస్‌లు సైతం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఐటీ ఉచ్చులో బిగుసుకున్న రామమోహన్ రావు చర్యలపై రాజకీయపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో సీఎం పన్నీరు సెల్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టున్నారు.
మహిళకే పట్టం : దివంగత సీఎం, అమ్మ జయలలిత 2011లో అధికార పగ్గాలు చేపట్టగానే, మహిళకు పట్టం కట్టే రీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పగ్గాలను షీలా బాలకృష్ణన్ కు అప్పగించారు. డిఎంకే హయంలో ఓ మహిళా అధికారి సీఎస్‌గా పనిచేసినా, ప్రభుత్వ, సీఎంతో సన్నిహితంగా మెలిగిన ప్రధాన కార్యదర్శి మాత్రం షీలా బాలకృష్ణన్ మాత్రమే. అందుకే నేటికి ఆమె సేవలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తూ,పన్నీరు సెల్వం ప్రభుత్వానికి ప్రస్తుతం అండగా ఉన్నారని చెప్పవచ్చు. షీలా తదుపరి మోహన్ వర్గీస్, జ్ఞాన దేశిక¯ŒSలు సీఎస్‌లుగా పనిచేశారు. తాజాగా సీఎస్ పదవిలో ఉన్న రామ్మోహన రావు రూపంలో పడ్డ మచ్చను తొలగించుకునేందుకు పన్నీరు సెల్వం చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు తీవ్ర కసరత్తులు చేశారని చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ బ్యాచ్‌కు చెందిన శక్తి కాంత్ దాస్ ముందు వరుసలో ఉన్నా, ఆయన కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండడం, మరికొన్ని నెలల్లో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టారు. తదుపరి స్థానంలో గిరిజా వైద్యనాథన్ , అశోక్ కుమార్ గుప్తా, రాజీవ్ నయన్ పేర్లు పరిశీలనకు వచ్చినా, చివరకు మహిళకే పన్నీరు ప్రభుత్వం పట్టం కట్టడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ ను నియమించడంతో సహచర ఐఏఎస్‌లకు ఆనందమే. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె అందర్నీ కలుపుకొనే వెళ్లే తత్వం కల్గిన అధికారిగా ముద్ర వేసుకుని ఉన్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో తన సేవల్ని అందించారు.
అత్యధికంగా కొన్ని సంవత్సరాల పాటు వైద్య శాఖకు సేవల్ని అందించిన ఘనత ఆమెకే దక్కుతుంది. గిరిజా వైద్యనాథన్‌కు ఇంకా రెండున్నరేళ్ల సర్వీసు ఉంది. రెండేళ్ల అనంతరం మళ్లీ మహిళా అధికారి సీఎస్ పగ్గాలు చేపట్టనుండడంతో పరిపాలన పరంగా దూసుకెళ్లేందుకు తగ్గ అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే, సీఎం పన్నీరు ప్రభుత్వానికి ఓ వైపు సలహాదారుగా షీలా బాలకృష్ణన్, మరో వైపు గిరిజా వైద్యనాథన్ ల రూపంలో మహిళా శక్తి అండగా ఉండడమే..!